దూసుకొచ్చిన మృత్యువు

old man dead in container road accident - Sakshi

కంటైనర్‌ ఢీకొని వృద్ధుడు మృతి

జాతీయ రహదారి దాటుతుండగా ఘటన

కాపుతెంబూరులో విషాదఛాయలు

కాశీబుగ్గ/పలాస రూరల్‌: ఆరోగ్యం బాగోలేదని వైద్యుని వద్దకు వెళుతున్న ఓ వృద్ధుడిని కంటైనర్‌ రూపంలో మృత్యువు కబళించింది. వైద్యుని వద్దకు వెళ్లేలోపలే రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఈ హృదయవిధారక సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. నందిగాం మండలం కాపుతెంబూరు గ్రామానికి చెందిన పోలాకి తమ్మినాయుడు(72) రోడ్డు ప్రమాదం మృతి చెందారు. ఇతనికి అనారోగ్యంగా ఉండడంతో స్వగ్రామం కాపుతెంబూరు నుంచి మోటారుసైకిల్‌పై కాశీబుగ్గలోని మల్లేశ్వరరావు డాక్టర్‌ వద్దకు వెళ్లేందుకు సోమవారం ఉదయం 8 గంటల సమయంలో బయలుదేరాడు.

అందరి కంటే ముందుగా ఆస్పతికి వెళ్లి వైద్య సేవలు పొందాలని భావించి భార్యతో చెప్పి బయల్దేరాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పారసాంబ గ్రామానికి సమీపంలో కంబిరిగాం కూడలి వద్ద మృత్యువాతపడ్డాడు. కంబిరిగాం జంక్షన్‌ వద్ద పలాస వైపు వచ్చేందుకు మోటారుసైకిల్‌ను జంక్షన్‌ దాటించేందుకు ప్రయత్నించగా ఇచ్ఛాపురం నుంచి టెక్కలి వైపు వెళుతున్న కంటైనర్‌ లారీ తమ్మినాయుడును బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. సుమారు 30 మీటర్ల పాటు ఇతడిని కంటైనర్‌ ఈడ్చుకెళ్లింది.

తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తమ్మినాయుడు మృతి చెందడంతో కంటైనర్‌ డ్రైవర్, క్లీనర్‌ ఇద్దరూ అక్కడ నుంచి పరుగులు పెట్టి పరారీ అయ్యారు. విషయం తెలుసుకున్న తమ్మినాయుడు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని విలపించారు. మృతుని భార్య, కుమార్తె మృతదేహంపై పడి విలపించడంతో పలువురు కంటతడి పెట్టారు. తమ్మినాయుడు సన్నకారు రైతు, గతంలో కో–ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడిగా, నీటిసంఘం అ«ధ్యక్షుడిగా పనిచేశారు. తమ్మినాయుడుకు భార్య మాణిక్యం, కుమారుడు షణ్ముఖరావు, కుమార్తె భారతి ఉన్నారు. కుమారుడు, కుమార్తెకు వివాహాలు జరిగాయి.

ఒక్కగానొక్క కుమారుడు షణ్ముఖరావు కరీంనగర్‌లో ప్రైవేటు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో భార్య, పిల్లలు, కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్‌ఐ ప్రసాదరావు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కంటైనర్‌ను పక్కకు తొలగించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top