ఒక్క రోజు రూ.25 లక్షలు!

Nine Cyber Crime Cases file in One Day Hyderabad - Sakshi

సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలోబాధితుల ఫిర్యాదు  

తొమ్మిది కేసులు నమోదు  

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ సమయంలోనూ సైబర్‌ నేరగాళ్ల జోరు తగ్గట్లేదు. ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా ఎర వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించిన బాధితులు వివిధ నేరాల్లో  అక్షరాలా రూ.25 లక్షలు మోసపోయారు. ఈ మేరకు ఆరు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.

పెళ్లి పేరుతో రూ.12.5 లక్షలు...
బోరబండ ప్రాంతానికి చెందిన బ్యూలా అనే యువతి తన ప్రొఫైల్‌ను భారత్‌ మాట్రిమోనీ సైట్‌లో అప్‌లోడ్‌ చేయగా సంజయ్‌ హ్యారీ అనే వ్యక్తి నుంచి రిక్వెస్ట్‌ వచ్చింది. అందుకు ఆమె స్పందించడంతో పాటు ఫోన్‌ నంబర్లు సైతం ఇచ్చిపుచ్చుకున్నారు. లండన్‌లో ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్న అతను తన తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు భారతీయ యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన లండన్‌ జాతీయుడి ఫొటోలను వాట్సాప్‌ ద్వారా పంపి తనవే అంటూ నమ్మించాడు. ఓ రోజు పార్శిల్‌ ద్వారా కొన్ని ఖరీదైన గిఫ్ట్‌లు పంపుతున్నానంటూ కొన్ని ఫొటోలు షేర్‌ చేశాడు. ఆ తర్వాతి రోజు కొరియర్‌ సంస్థ పేరుతో యువతికి కాల్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు లండన్‌ నుంచి మీ పేరుతో వచ్చిన పార్శిల్‌లో ఖరీదైన వస్తువులు, బంగారం, నగదు ఉందని, దానిని రిలీజ్‌ చేయడానికి కొంత ట్యాక్స్‌ చెల్లించాలని ఎర వేశారు. ఆమె నమ్మడంతో పలు దఫాలుగా రూ.12.5 లక్షలు తమ బ్యాంకు ఖాతాల్లో వేయించుకున్నారు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

కమీషన్‌ కోసం ఆశపడి రూ.7.5 లక్షలు  
నగరానికి చెందిన ఓ వ్యాపారి సీజనల్‌ వ్యాపారాలు చేస్తుంటాడు. ప్రస్తుతం మాస్కులకు డిమాండ్‌ ఉండటంతో ఆ వ్యాపారం చేయాలని భావించిన అతను ఎన్‌–95 మాస్కులు హోల్‌సేల్‌గా తక్కువ ధరకు సరఫరా చేసే దేశీయ, విదేశీ కంపెనీల కోసం ఆరా తీశారు. ఈ నేపథ్యంలో తన సోదరుడి ద్వారా మలేషియాకు చెందిన కంపెనీ ఫోన్‌న్‌నంబర్‌ దొరికింది. వారితో సంప్రదింపులు జరిపిన సదరు వ్యాపారి 2 వేల మాస్కుల్ని రూ.7.5 లక్షలకు సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నాడు. అయితే వాటిని కోయంబత్తూర్‌లో ఉన్న తన క్‌లైంట్‌కు ఇవ్వాలని సూచించాడు. ఇందుకు కంపెనీ అంగీకరించడంతో అడ్వాన్సుగా కొంత మొత్తం చెల్లించాడు. మాస్కులు పార్శిల్‌ చేశామంటూ ఓ ట్రాకింగ్‌ ఐడీ ఇచ్చిన నేరగాళ్లు సరుకు కొయంబత్తూరు చేరినట్లు నమ్మించి మిగిలిన మొత్తం తమ ఖాతాల్లో వేయించుకున్నారు. బుధవారం బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది.

మరో మూడు నేరాల్లో రూ.2లక్షలు...
ఇన్‌స్ట్రాగామ్‌లో ‘జస్ట్‌ షేర్‌ అఫీషియల్‌’ పేరుతో ఓ పేజ్‌ ఏర్పాటు చేసిన సైబర్‌ నేరగాళ్లు దీని ద్వారా అనేక మందికి టోకరా వేస్తున్నారు. ఈ పేజ్‌ని నమ్మిన ఓ నగర యువకుడు అత్యాధునిక ఐ–ఫోన్‌ కోసమని రూ.34 వేలు చెల్లించి మోసపోయాడు. అలాగే ఓ నగరవాసికి బ్యాంకు అధికారి పేరుతో రూ.70 వేలు టోకరా వేశారు. మరో వ్యక్తికి ఇలానే గాలం వేసి రూ.30 వేలు కాజేశారు. ఓఎల్‌ఎక్స్‌లో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాన్ని ఖరీదు చేయాలని భావించిన ఓ వ్యక్తి నుంచి సైబర్‌ నేరగాళ్లు అడ్వాన్స్‌ పేరుతో రూ.65 వేలు కాజేశారు. 

బ్యాంకు ఉద్యోగికి రూ.2లక్షలు టోకరా
ఓ బ్యాంకు ఉద్యోగి ఖాతా నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.2 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే మీ కార్డు బ్లాక్‌ అవుతుందంటూ లాలాగూడకు చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. క్రెడిట్‌ కార్డు వివరాలు చెబితే ఇప్పుడే అప్‌గ్రేడ్‌ చేస్తామంటూ ఓటీపీలు చెప్పించుకొని రూ.70 వేలు తమ ఖాతాలలోకి బదిలీ చేసుకున్నారు. ఫేస్‌బుక్‌ సంస్థకు చెందిన మార్కెట్‌ ప్లేస్‌లో బైక్‌ విక్రయ ప్రకటన చూసిన ఓ వ్యక్తి దానిని కొనేందుకు విక్రేతతో మాట్లాడారు. తాము ఆర్మీ ఉద్యోగులమని నమ్మించి, రూ.65 వేలు డిపాజిట్‌ చేయించుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top