పిక్‌పాకెటర్‌పై సూడో పోలీసుల వల | Nine accused were arrested kidnap case | Sakshi
Sakshi News home page

పిక్‌పాకెటర్‌పై సూడో పోలీసుల వల

Apr 10 2019 2:28 AM | Updated on Apr 10 2019 5:48 AM

Nine accused were arrested kidnap case - Sakshi

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: అతడో పిక్‌పాకెటర్‌. బస్సుల్లో తిరుగుతూ సెల్‌ఫోన్లు చోరీ చేస్తుంటాడు. ఈ నెల 2న అమీర్‌పేట మైత్రీవనం ఎదురుగా ఉన్న బస్టాప్‌ ప్రాంతంలో ఉండగా కొంతమంది వచ్చి అతడిని పట్టుకున్నారు. తాము పోలీసులం అని చెప్పి తీసుకెళ్లారు. ఇంటరాగేషన్‌ పేరుతో చిత్రహింసలు పెట్టారు. చివరకు రూ.50 లక్షలు డిమాండ్‌ చేసి, అతడి భార్య నుంచి రూ.18 లక్షలు వసూలు చేసి విడిచిపెట్టారు. అయితే, తనను తీసుకెళ్లింది పోలీసులు కాదని తెలియడంతో ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధి తుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడి సమీప బంధువుతోపాటు పది మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మంగళవారం వెల్లడించారు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన వెంకటయ్య కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి స్థిరపడ్డాడు. బస్సుల్లో తిరుగుతూ సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడేవాడు.

వెంకటయ్యపై పలు పోలీసుస్టేషన్లలో 40కి పైగా కేసులు ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. చోరీల ద్వారా సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేస్తున్న వెంకటయ్యను చూసి, అతడి సమీప బంధువైన నిజామాబాద్‌కు చెందిన పిట్ల శంకర్‌కు దుర్బుద్ధి పుట్టింది. అతడిని కిడ్నాప్‌ చేసి బెదిరించడం ద్వారా పెద్ద మొత్తం రాబట్టవచ్చంటూ తన స్నేహితులకు చెప్పి పథకం రూపొందించాడు. ఈనెల 2న మైత్రీవనం బస్టాప్‌ వద్ద ఉన్న వెంకటయ్య వద్దకు తన స్నేహితులను పంపించాడు. తాము పోలీసులమని, కేసు విషయమై విచారణకు రావాలని చెప్పి అతడిని కిడ్నాప్‌ చేసి, యాదగిరిగుట్టలోని యాదాద్రి గౌడ్‌ ట్రస్ట్‌ భవన్‌ లాడ్జికి తీసుకెళ్లారు.

అక్కడ ఇంటరాగేషన్‌ పేరుతో చిత్ర హింసలకు గురి చేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించి హింసించారు. సిగరెట్లు కాల్చి వాతలు కూడా పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో శంకర్‌ బయటకు రాకుండా వెనకాల ఉండి కథ నడిపించాడు. అనంతరం వెంకటయ్య భార్యకు ఫోన్‌ చేసి రూ.50 లక్షలు ఇవ్వకుంటే అతడిని చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె తన వద్దనున్న రూ.18 లక్షలతోపాటు 4.5 తులాల బంగారం ఇచ్చేందుకు అంగీకరించింది. కిడ్నాపర్ల సూచన మేరకు భువనగిరికి తీసుకెళ్లి ఓ వ్యక్తికి వాటిని అప్పగించింది. అనంతరం ఈ నెల 4న కిడ్నాపర్లు వెంకటయ్యను విడిచిపెట్టారు. 

స్నేహితుడికి అనుమానం రావడంతో...  
ఇంటికి వచ్చిన వెంకటయ్య.. తనను పోలీసులే తీసుకెళ్లారని అనుకున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయాడు. అయితే, ఈనెల 6న వెంకటయ్యను పరామర్శించడానికి వచ్చిన ఓ స్నేహితుడు.. అతడి ఒంటిపై ఉన్న గాయాలు చూసి అనుమానించాడు. పోలీసులు ఇలా చేయరని, ఎక్కడో ఏదో తిరకాసు ఉందని చెప్పాడు. దీంతో వెంకటయ్య ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైత్రీవనం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ ఆధారంగా కిడ్నాపర్ల కారు నంబర్‌ గుర్తించారు. దీంతో పాటు సాంకేతికంగా ముందుకు వెళ్లిన పోలీసులు వెంకటయ్య సమీప బంధువు పిట్ల శంకర్‌ సూత్రధారిగా, అతడి స్నేహితులు పాత్రధారులుగా ఈ కిడ్నాప్‌ వ్యవహారం సాగినట్లు తెలుసుకున్నారు. శంకర్‌తో పాటు ఇంద్రాల చిరంజీవి, కొల్లి సాయికృష్ణ, రాజారామ్, పిట్ల రవి, అబ్దుల్‌ హమీద్, పంజాల సాయికృష్ణ, షేక్‌ అన్వర్, గుర్రం కళ్యాణ్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులు అజయ్‌కుమార్, మురళీకృష్ణ, బందయ్యలను డీసీపీ శ్రీనివాస్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement