బిహార్ ఎన్నికల ర్యాలీలో హోంమంత్రి అమిత్‌షా
ముజఫర్‌పూర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూప్రసాద్ యాదవ్ కొడుకు (తేజస్వీ యాదవ్) కోసం ఓట్లు వేస్తే కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో హంతకులు, కిడ్నాపర్లు, దోపిడీరులే మంత్రులు అవుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ముఫరాబాద్, వైశాలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఎన్డీయేను గెలిపిస్తే వరదల నియంత్రణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
లాలూ కుటుంబంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. ‘ఒకవేళ లాలూ కుమారుడు (తేజస్వీ యాదవ్) బిహార్ ముఖ్యమంత్రి అయితే.. మూడు కొత్త మంత్రిత్వ శాఖలు పుట్టుకొస్తాయి. అవే హత్యలు, కిడ్నాపులు, దోపిడీల శాఖలు. ఎన్డీయేకు ఓటు వేస్తే ఆర్జేడీ జంగిల్ రాజ్ నుంచి బిహార్‌ను కాపాడుతాం. కొత్త ముఖాలతో మళ్లీ జంగిల్‌రాజ్‌ను తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మహాఘట్‌బంధన్‌లో సీట్ల కోసం కొట్టుకుంటుండగా, ఎన్డీయేలోని ఐదు భాగస్వామ్య పార్టీలు బిహార్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రయతి్నస్తున్నాయి. ఎన్డీయేలోని బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ (ఆర్‌వీ), హెచ్‌ఏఎం, కుశ్వాహా పార్టీలు.. పంచపాండవులు’అని షా అభివర్ణించారు. ‘లాలూ కంపెనీ, రాహుల్ కంపెనీ రూ.12 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయి’అని ఆరోపించారు. ప్రాచీనకాలంలో లిచ్చవీ సామ్రాజ్యంలో విలసిల్లినట్లుగా వైశాలికి పూర్వవైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైశాలిలో 1,243 ఎకరాల్లో మెగా పారిశ్రామిక వాడను నిర్మిస్తామని, దీని ద్వారా వేలమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
నాడు ఉగ్రవాదులకు బిర్యానీలు పెట్టారు
సోనియా, మన్మోహన్, లాలూ జమానాలో మనదేశంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు బిర్యానీలు తినిపించారని, మోదీ జమానాలో ఉగ్రవాదులను అంతం చేసి, వారి నివాసాలను కూల్చేస్తున్నామని అమిత్ షా తెలిపారు. దేశాన్ని ప్రధాని మోదీ సురక్షితంగా, సుసంపన్నంగా మార్చి అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారని తెలిపారు. ముజఫర్‌పూర్‌లో రూ.20,000 కోట్లతో మెగా ఫుడ్‌పార్కును నెలకొల్పుతున్నామని చెప్పారు.


