వీడని జంట హత్యల మిస్టరీ

Murders Mystery Still Pending In Anantapur - Sakshi

హతులు తల్లీ కుమారుడు

పోలీసుల అదుపులో హతురాలి సోదరుడు

గుత్తి మండలం రజాపురం శివారులో శనివారం వెలుగుచూసిన జంట హత్యల (తల్లీ కుమారుడి) కేసు మిస్టరీ వీడలేదు. హతురాలు వైఎస్సార్‌ జిల్లా బద్వేలుకు చెందిన లక్ష్మీ అలియాస్‌ బానుగా గుర్తించారు.
పోలీసులు బద్వేలుకు వెళ్లి హతురాలి సోదరుడిని విచారించారు. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అతడిని గుత్తికి తీసుకువచ్చారు. బద్వేలు పోలీసులు హతురాలి తల్లిరమణమ్మ, హతురాలి మొదటి భర్త బాదుల్లా సోదురుడిని స్టేషన్‌కుతీసుకువచ్చి విచారణ చేస్తున్నారు.

అనంతపురం, గుత్తి రూరల్‌: బద్వేలు పట్టణంలోని మంగళి కాలనీకి చెందిన సుబ్బరాయుడు, రమణమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీదేవికి సుందరయ్య కాలనీకి చెందిన షేక్‌ మస్తాన్‌ బాషా, మైమూన్‌ దంపతుల పెద్ద కుమారుడు బాదుల్లాతో 2009లో ప్రేమ వివాహం జరిగింది. కొన్నేళ్లు వీరి కాపురం సాఫీగా సాగింది. అనంతరం భర్త తాగుడుకు బానిసై ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు. కొన్ని నెలల తరువాత ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి తన ఇద్దరు కుమారులు మౌలాలి బాషా, మాబ్బాషాలను తీసుకెళ్లిపోయాడు. రెండు రోజులైనా రాకపోవడంతో మద్యం మత్తులో ఎక్కడికైనా వెళ్లి ఉంటాడని తెలిసిన వాళ్లు, బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోయింది. కొన్ని నెలల తరువాత బాదుల్లా బాక్రాపేట వద్ద మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడని తెలుసుకున్న భార్య లక్ష్మీ అతడిని ఇంటికి తెచ్చి పిల్లల గురించి ఆరా తీసింది. అయితే అతడు హైదరాబాదులో విడిచానని ఒకసారి, తిరుపతిలో వదిలేశానని మరోసారి పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. ఆ రెండు చోట్లకు వెళ్లి గాలించినా పిల్లలు దొరకలేదు. భర్త ఇద్దరినీ వదిలేసినా అప్పటికే వారికి షరీఫ్‌ అనే మూడు నెలల కొడుకు ఉన్నాడు. అనంతరం లక్ష్మీ తన కుమారుడిని ఎక్కడో వదిలేసింది. తర్వాత ఆమె కూడా మతిస్థిమితం లేనట్లుగా ప్రవర్తిస్తుండటంతో కుటుంబ సభ్యులు మైదుకూరు సమీపంలోని ఖాజీపేటలో గల ఓ ఆలయంలో విడిచిపెట్టారు.

మరొకరితో సహజీవనం..
ఖాజీపేటలో లక్ష్మీ మరో వ్యక్తితో సహజీవనం చేయసాగింది. ఈ క్రమంలో వారికి ఒక కుమారుడు జన్మించాడు. వారం రోజుల కిందట లక్ష్మీ తల్లి వద్దకు వెళ్లగా ఆమె వ్యవహారం తెలుసుకున్న తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో లక్ష్మి అక్కడి నుంచి ఆమె ఎటో వెళ్లిపోయింది. ఆ తర్వాత  సహజీవనం చేస్తున్న వ్యక్తి బద్వేలులోని లక్ష్మీ ఇంటికి వెళ్లి ఆమె గురించి ఆరా తీశాడు. అక్కడ ఎటువంటి సమాధానమూ రాకపోవడంతో అతడు వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో లక్ష్మీ గుత్తి శివారులో కొడుకుతో కలిసి శవమై తేలింది. వీరిని ఎవరు చంపారనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం ఆంజనేయస్వామి ఆలయ దర్శనం కోసం శుక్రవారమే వచ్చినట్లు తెలుస్తోంది. మతిస్థిమితం సరిగాలేని లక్ష్మి వెంట ఎవరు వచ్చారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆలయంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఏదైనా ఆధారం దొరికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదా గుత్తిలోని స్వస్థత శాలకు వచ్చినా అక్కడా సీసీ కెమెరాలను పరిశీలించినా లక్ష్మి వెంట ఎవరు వచ్చారో తెలిసే అవకాశం ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top