ప్రియురాలి దారుణ హత్య

Murder Case Solved in Nizamabad - Sakshi

మహారాష్ట్ర నుంచి పిలిపించి ఘాతుకం

గుండెనెమ్లి హత్యకేసును ఛేదించిన పోలీసులు

ప్రధాన నిందితుడితో సహా నలుగురి రిమాండ్‌

కామారెడ్డి క్రైం: పరాయి వ్యక్తితో పరిచయం సంసారాన్ని నాశనం చేయడమే కాక ఆమెను కూడా బలి తీసుకుంది. కాపురం కూలిపోవడానికి కారణమైన వ్యక్తే ఆమెను కిరాతకంగా మట్టుబెట్టాడు. సంసారంలో నిప్పులు పోసినందుకు గాను ఆస్తిలో వాటా ఇవ్వమన్న మహిళను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. మహారాష్ట్రలో ఉన్న ఆమెకు మాయమాటలు చెప్పి కామారెడ్డి జిల్లాకు రప్పించిన కిరాతకుడు.. ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. రాష్ట్రాలు దాటి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు గుండెనెమ్లి వద్ద జరిగిన మహిళ హత్య కేసును ఛేదించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శ్వేత కేసు వివరాలను వెల్లడించారు. బిచ్కుంద మండలం గుండెనెమ్లి గ్రామ శివారులోని గుంటి చెరువు ప్రాంతంలో గల బ్రిడ్జి కింద గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్లుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడకు చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం కుళ్లిపోవడంతో హత్యకు గురైన మహిళ ఎవరనేది తెలియలేదు. చాలా చోట్ల దర్యాప్తు చేపట్టగా, ఆమె సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోరిగి గ్రామవాసి బిరాధర్‌ సత్యకళ (33)గా గుర్తించారు. కేసులో ప్రధాన నిందితుడైన అదే గ్రామానికి చెందిన రాథోడ్‌ దేవిదాస్‌తో చాలా కాలంగా పరిచయం ఉంది. వారి పరిచయం కారణంగా కుటుంబాల్లో వివాదాలు తలెత్తి, కొంతకాలంగా సత్యకళ మహారాష్ట్రలోని తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది.తరచుగా దేవిదాస్‌కు ఫోన్‌ చేస్తూ ‘నీ కారణం గా నా సంసారం వీగిపోయింది, నా బతుకు దెరువు కోసం ఆస్తిలో వాటా ఇవ్వాలని లేదా నీతో నే ఉంటానని’ అంటుండేది.

దీంతో సత్యకళను ఎలాగైనా వదిలించుకోవాలని దేవిదాస్‌ భావించాడు.తన బంధువులు రాథోడ్‌ కపిల్, చౌహాన్‌ సంతోష్, చౌహాన్‌ మోహన్‌లతో కలిసి సత్యకళ హత్యకు పథకం వేశారు. అదే ప్రాంతంలో హత్య చేస్తే పోలీసులకు దొరికిపోతామని భావించి దూరంగా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.మహారాష్ట్రలో ఉన్న సత్యకళను పిలిపించి గుండెనెమ్లి శివారు ప్రాంతంలోకి తీసుకొచ్చారు. బ్రిడ్జి కిందకు తీసుకువెళ్లి మెడ చుట్టూ తాడువేసి లాగి హత్య చేశారు. కొన ఊపిరితో ఉండగానే ఆమె కాళ్లు, చేతులు కట్టేసిన నిందితులు పూర్తిగా చనిపోయిందని నిర్ధారణ అయ్యాక బ్రిడ్జి కిందనే పడేసి, ఆమె ఒంటి పై ఉన్న ఆభరణాలు, సెల్‌ఫోన్‌ తీసుకుని పారిపోయారు. 

చీర ఆధారంగా మృతురాలి గుర్తింపు.. 

ఘటనా స్థలంలో విచారణ ప్రారంభించిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతురాలు ఎవరనేది తెలియదు. చుట్టు పక్కల పోలీస్‌స్టేషన్‌లలో ఏవైనా మిస్సింగ్‌ కేసులు నమోదయ్యయా అని ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది.ఎలాగైనా కేసును ఛేదించాలని పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఘటనా స్థలంలో తీసిన ఫొటోల ఆధారంగా పక్క జిల్లాలు, మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాల్లో ఆమెను గుర్తించేందుకు ప్రయత్నించారు. దెగ్లూర్‌ ప్రాంతంలో ఆమె ఎవరనేది చీర ఆధారంగా గుర్తించారు.అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం, సోషల్‌ మీడియాలో సైతం అన్ని రకాలుగా పరిశీలన జరిపి, అన్ని కోణాల్లో విచారణ జరిపి కేసును ఛేదించినట్లు ఎస్పీ తెలిపారు. హత్య చేసిన నలుగురు నిందితులను, ఆభరణాలను, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన బిచ్కుద సీఐ రవీందర్, ఎస్సైలు నాగరాజు, కాశీనాథ్, సిబ్బంది శ్రీకాంత్, అబ్బులు, సంతోష్, సాయిలును ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top