కొత్తజంటపై హత్యాయత్నం

Murder Attempt on Love married Couple in Krishna - Sakshi

కత్తితో దాడికి యత్నించిన బెంగళూరు యువకులు

నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు

కృష్ణాజిల్లా, జి. కొండూరు (మైలవరం): ప్రేమ వివాహం చేసుకొన్న యువ జంటపై యువతి అన్నయ్యతో పాటు మరో ఐదుగురు కలిసి హత్యాయత్నం చేయబోయిన ఘటన జి. కొండూరు మండల పరిధిలోని తెల్లదేవరపాడు గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకొంది. బాధితుల వివరాల ప్రకారం... జి.కొండూరు మండల పరిధిలోని గంగినేని గ్రామానికి చెందిన పొదిలి బాలగిరీష్‌ 8 నెలల క్రితం బెంగళూరులోని ఓ షాపింగ్‌ మాల్‌లో అకౌంటెంట్‌గా చేరాడు. బెంగళూరుకు చెందిన తన సహ ఉద్యోగి మానసతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం మానస కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమెకు వేరే పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న బాలగిరీష్‌.. మానసను తీసుకొని డిసెంబరు 15వ తేదీన ద్వారకాతిరుమల వచ్చి స్నేహితుల సహాయంతో వివాహం చేసుకొన్నాడు. అనంతరం తెల్లదేవరపాడులో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు.

వీరిద్దరి పెళ్‌లైన వారం రోజుల తర్వాత మానస కుటుంబ సభ్యులు కర్ణాటక పోలీసులతో కలిసి గంగినేని వచ్చారు. కుటుంబ సభ్యులు మానసను తమతో రావాలని కోరారు. తల్లిందండ్రులతో వెళ్లేందుకు మానస నిరాకరించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. చేసేదిలేక కుటుంబ సభ్యులు వెనుదిరిగి వెళ్లారు. అయితే మానస అన్నయ్య వినయ్‌ తన ఐదుగురు స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి జి. కొండూరు వచ్చాడు. మానసతో రెండు రోజులుగా ఫోన్‌లో మంచిగా మాట్లాడుతూ అడ్రస్‌ సేకరించాడు. తనతో వచ్చిన ఐదుగురు స్నేహితులతో కలిసి కారులో వచ్చిన వినయ్‌ బుధవారం ఉదయం తెల్లదేవరపాడులో మానస, బాలగిరీష్‌ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. మానసను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టింది. అంతలోనే బయటకు వచ్చిన బాల గిరీష్‌పై వినయ్‌తో పాటు అతని స్నేహితులు వెంట తెచ్చిన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇంటి పక్కన వాళ్లు వచ్చి నిందితులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే ఇరుపక్షాలు రాజీకి రావడంతో జి. కొండూరు పోలీసులు నిందితులను బైండోవర్‌ చేసి వదిలేశారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top