ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో...! | Mother Commits Suicide With Children In Simhachalam | Sakshi
Sakshi News home page

ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో...!

Jul 15 2019 8:18 AM | Updated on Jul 15 2019 1:09 PM

Mother Commits Suicide With Children In Simhachalam - Sakshi

 నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద గుమిగూడిన స్థానికులు (ఇన్‌సెట్‌)

సాక్షి, సింహాచలం/పెందుర్తి: తొలి సంతానం ఆడబిడ్డ.. లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిందని సంబరపడింది ఆ తల్లి.. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ ముద్దులొలికే మాటల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది.. ఆ చిన్నారికి మరెన్నో కబుర్లు చెబుతూ గోరుముద్దలు తినిపిద్దామని ఆశపడింది.. కానీ విధి మరోలా తలచింది.. ఆ బిడ్డకు మాట రాలేదు.. మాటలు వినపడలేదు.. ఆడబిడ్డ జన్మించిన మూడేళ్లకు మగబిడ్డ రూపంలో మరో సంతానం.. ఈ సారీ అదే ఆశ.. అంతకు మించిన ఆత్రుత.. చిట్టచివరకు అదే వేదన.. ఇద్దరి బిడ్డల పండంటి భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లి పూజ చేయని అమ్మవారు లేదు.. మొక్కని దేవత లేదు.. కానీ ఏ ‘తల్లీ’ కరుణించలేదు.. బలీయమైన విధి చేతిలో ఈ ‘అమ్మ’ ఓడిపోయింది. పిల్లల భవిష్యత్‌పై పూర్తిగా ఆశలు వదులుకున్న ఆ మాతృమూర్తి వారి గొంతులో గరళం పోసింది.. తానూ ఆ కాలకూటాన్ని మింగేసి తనువు చాలించింది.. సింహాచలం సమీపంలోని గొల్లనారాయణపురంలో పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. విగతజీవులుగా పడి ఉన్న తల్లీ బిడ్డలు బురకాయల అరుణ(30), రమ్యశ్రీ(9), మహేష్‌(6)ను చూసి కంటతడి పెట్టనివారు లేరు. ఓ వైపు పిల్లల వైకల్యం.. మరోవైపు ఆర్థిక భారం ఈ పెను విషాదానికి కారణమయ్యాయి. ఉన్నంతలో జీవనం సాగిస్తున్న సమయంలో భార్య పిల్లలు శాశ్వతంగా దూరం కావడంతో అరుణ భర్త సత్యనారాయణ తల్లడిల్లిపోతున్నాడు.

అమ్మ సన్నిధిలోనే అనంతలోకాలకు 
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం సమీపంలో ఉన్న గొల్లనారాయణపురంలో చోటుచేసుకుంది. పెందుర్తి సీఐ వెంకునాయుడు, స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామానికి చెందిన బురకాయల సత్యనారాయణ, అరుణ (30) దంపతులు గత ఆరేళ్లుగా గొల్లనారాయణపురంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సత్యనారాయణ శ్రీకాకుళంలోని అరబిందో ఫార్మసీలో పనిచేస్తూ వారానికి ఒకటి రెండుసార్లు గొల్లనారాయణపురంలోని ఇంటికి వస్తుంటాడు. వీరికి రమ్యశ్రీ (9), మహేష్‌ (6) అనే పిల్లలున్నారు. పిల్లలు ఇద్దరికీ పుట్టుక నుంచే మూగ, చెవుడు కావడంతో తల్లి నిత్యం మదనపడేది. రోజూ చుట్టుపక్కల వారితో పిల్లల పరిస్థితిని చెప్పుకుని బాధపడేది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో మెరుగైన వైద్యం చేసే పరిస్థితి లేకపోవడంతో కుమిలిపోయేది. ఉన్నంతలో అప్పుడప్పుడు వైద్యులకు చూపించినా ఫలితం ఉండేది కాదు. కాస్త దైవభక్తి ఎక్కువ ఉన్న అరుణ తన పిల్లలు బాగుపడాలని నిత్యం దేవతలను పూజిస్తుండేది. స్థానికంగా ఉన్న నూకాంబిక ఆలయంలో అమ్మవారికి సేవలు చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ దగ్గరైంది. 


భర్త సత్యనారాయణని విచారిస్తున్న పెందుర్తి సీఐ వెంకునాయుడు

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భర్త సత్యనారాయణ ఫోన్‌ చేసి ఉదయం ఇంటికి వస్తున్నట్టు అరుణకి చెప్పాడు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో శ్రీకాకుళం నుంచి సత్యనారాయణ ఇంటికి రాగా అరుణ, పిల్లలు ఇంట్లో కనిపించలేదు. ఫోన్‌ చేసినా ఫలితం లేకపోవడంతో చుట్టుపక్కల ఇళ్ల వద్ద వెతికాడు. ఆలయానికి వెళ్లిందేమోనని పలువురు చెప్పగా సత్యనారాయణ ఆలయం వద్దకు వెళ్లాడు. ఆలయం వెనుక ప్రాంగణంలో నిర్జీవ స్థితిలో పడి ఉన్న భార్య, పిల్లలను చూసి షాకయ్యాడు. అప్పటికే అరుణ పిల్లలకి విషం ఇచ్చి తానూ తాగి మృతి చెందింది. దీంతో సత్యనారాయణ స్థానికులకు, పెందుర్తి పోలీసులకు సమాచారం అందించాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి సీఐ వెంకునాయుడు సత్యనారాయణ, స్థానికులను విచారించారు. పిల్లలిద్దరూ మూగ, చెవుడు కావడంతో అరుణ మానసికంగా బాధపడుతుండేదని, ఆర్థిక పరిస్థితులు కూడా కారణం కావచ్చని స్థానికులు చెప్పినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. అరుణ పిల్లలతో సహా మృతి చెందిందని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు తరలివచ్చారు. ఎప్పుడూ పిల్లల గురించే మాట్లాడేదని, పిల్లలకు చెవుడు, మూగ కావడంతో ఎప్పటికైనా అమ్మవారు కరుణిస్తుందని చెప్పేదని పలువురు మహిళలు కంటతడి పెట్టారు. భార్య సహా పిల్లలు కూడా ఒకేసారి మృత్యుఒడికి చేరుకోవడంతో సత్యనారాయణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement