
పాడేరు రూరల్: తనను కాదని తమ్ముడికి పెళ్లి సంబంధం కుదిర్చారనే ఉక్రోషంతో తల్లిదండ్రులతోపాటు రక్తం పంచుకు పుట్టిన సోదరుడిని మట్టుబెట్టేందుకు ఓ జులాయి ప్రయత్నించాడు. నిందితుడి తండ్రి అనుగూరి పోతురాజు తెలిపిన వివరాలు.. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం చాపగెడ్డ గ్రామానికి చెందిన అనుగూరి శ్రీనుబాబు జల్సాలకు, మద్యానికి అలవాటు పడ్డాడు. తన కంటే ముందు తన తమ్ముడికి పెళ్లి సంబంధం కుదిర్చారన్న కోపంతో కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్నాడు.
గురువారం రాత్రి భోజనం అనంతరం తల్లి చిట్టమ్మ, తమ్ముడు చంటిబాబు నిద్రకు ఉపక్రమించగా తండ్రి పోతురాజు బయటకు వెళ్లాడు. దీంతో శ్రీనుబాబు తన వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని పెట్రోల్‌ను తల్లి, తమ్ముడిపై పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకుని వచ్చిన తండ్రి పోతురాజు అడ్డుకోగా అతని చేతిని కొరికి గాయపరిచి పారిపోయాడు. తీవ్రగాయాల పాలైన చిట్టమ్మ, చంటిబాబు, స్వల్పగాయాలైన పోతురాజు పాడేరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.