ఇక బతకలేమని.. | Mother And Daughter Committed Suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

Aug 24 2018 1:40 PM | Updated on Aug 29 2018 2:53 PM

Mother And Daughter Committed Suicide  - Sakshi

మృతిచెందిన తల్లి సరిత (ఫైల్‌), కూతురు మధుమిత (ఫైల్‌) 

వరంగల్‌ క్రైం : కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. అయినా కొడుకు, కూతురు ఉన్నారనే ధైర్యంతో అన్నీ తానై బతుకు బండిని ముందుకు సాగించింది. అకస్మాత్తుగా కొడుకు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించాడు. కన్న కొడుకు కానరాని లోకాలకు తరలిపోవడంతో ఆ తల్లికి గుండె పగిలినంత పనైంది. కొడుకును విడిచి ఉండలేనంత ప్రేమను మనసులో నింపుకుందేమో.. ఆ కొడుకు దగ్గరికే వెళ్లిపోయింది.

తాను లేకుండా తన కూతురు ఎలా బతుకుతుందో అని.. వెళ్తూ కూతురును కూడా మృత్యుఒడిలోకి తీసుకెళ్లింది.. హృదయవిదారకమైన ఈ ఘటన హన్మకొండ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కొత్తురు–బొక్కలగడ్డలో గురువారం జరిగింది.హన్మకొండ తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మనుగొండ సరిత(39), కూతురు మనుగొండ మధుమిత (17) ఇంట్లో దూలానికి ఉరివేసుకొని మృతి చెందింది. హన్మకొండ ఎస్సై ఎలబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సరిత భర్త మనుగొండ బాబు 1992 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌.. 2007లో అనారోగ్యంతో బాబు చనిపోయారు. భర్త మరణంతో అతడి ఉద్యోగం సరితకు రాగా రెవెన్యూ శాఖలో పనిచేస్తోంది. నాలుగు నెలల క్రితం ఆమె కుమారుడు రోహిత్‌(21) హన్మకొండలోని సర్క్యూట్‌ గెస్ట్‌ హౌస్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.. కట్టుకున్న భర్త, కన్నకొడుకు మరణంతో సరిత తీవ్ర మానసిక వేదనకు గురైంది.

రోహిత్‌ మరణించిన తర్వాత ఉద్యోగానికి వెళ్లడం లేదు. ఇటీవలే బంధువులు, తోటి ఉద్యోగులు ధైర్యం చెప్పడంతో కొంతకాలంగా విధులకు హాజరవుతోంది. ఉద్యోగం చేస్తూ సుబేదారి ప్రాంతంలో నివాసం ఉండేది. ఇటీవల ఆమె తల్లిదండ్రుల కోరిక మేరకు వారి ఇంట్లోనే ఉంటోంది. గురువారం దేశాయిపేటలో బంధువుల పెళ్లి ఉండడంతో సరిత తల్లిదండ్రులు వెళ్లా రు. సరితను పెళ్లికి రమ్మని ఎంత బ్రతిమిలాడినా వెళ్లలేదు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెళ్లి నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు తీసేందుకు బయటి నుంచి సరితను పిలిచారు. లోపల గడియ పెట్టి ఉండి.. ఎంత పిలిచినా సరిత, మధుమిత పలుకలేదు. దీంతో బలవంతంగా తలుపులను తెరిచి చూడగా సరిత, మధుమిత ఇంటి దూలానికి వేలాడుతూ కనిపించారని ఎస్సై వివరించారు. దూలానికి వేలాడుతున్న వారిని చూసి తల్లిదండ్రులు, అన్నావదినలు గుండెలవిసేలా రోధించారు. 11 ఏళ్లలో కుటుంబంలో అందరూ చనిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. సరిత, మధుమితల మృతదేహాలను చూసి బంధువులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు కంటతడి పెట్టుకున్నారు. సరిత తండ్రి ఇజ్జగిరి చేరాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

ఉద్యోగంలో సౌమ్యురాలు..
హన్మకొండ తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే మనుగొండ సరితకు సౌమ్యురాలుగా పేరుంది. కొడుకు మరణించిన తర్వాత అందరితో తక్కువగా మాట్లాడేదని, కొడుకు జ్ఞాపకాలతోనే రోజులు గడిపేదని సహ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి కంటతడితో నివాళులు అర్పించారు. సరిత మరణం వార్త విన్న ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతల పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు.

తన కొడుకులా.. ఎవరికీ జరగొద్దని..
సరిత కుమారుడు రోహిత్‌కు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్‌ ధరించి ఉంటే బతికేవాడని బంధువులు తెలిపారు. తన కొడుకులా మరెవరికీ అలాంటి పరిస్థితి రావొద్దని.. సరిత.. రోహిత్‌ స్నేహితులు, బంధువులకు 100 మందికిపైగా హెల్మెట్లు కొనిచ్చింది.. ఈ సారి రాఖీ పండుగకు తన బంధువుల్లో ద్విచక్రవాహనాలు ఉన్న వారందరికీ హెల్మెట్లు కొనివ్వడానికి కూడా ఏర్పా ట్లు చేసిందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

నివాళులర్పించిన కలెక్టర్, జేసీ
భర్త, కుమారుడి మరణంతో మనస్తాపం చెంది ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన మనుగొండ సరిత, కూతురు మధుమిత మృత దేహాలను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి కాట, జేసీ దయానంద్, హన్మకొండ తహసీల్దార్‌ ఖాజామోయినోద్దిన్‌లు సందర్శించి నివాళులర్పించారు. గురువారం రాత్రి కావడంతో మృత దేహాలకు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement