
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్‌లోని ఓ ట్రైన్ బోగీలో డబ్బులు కలకలం రేపాయి. పోలీసు సోదాల్లో సుమారు 65 లక్షల రూపాయల నగదు బయటపడింది. హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కంటైనర్‌లో చెప్పులు, ఎలక్ట్రానిక్ వస్తువుల డబ్బాల్లో ప్యాకింగ్ చేసి తరలించారు. గత కొంతకాలంగా డబ్బును ఈ విధంగా అక్రమమార్గాల్లో తరలిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది.
పక్కా సమాచారంతో దాడులు చేసి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. నోట్ల కట్టలపై ఉన్న బ్యాంకు లేబుల్స్ ద్వారా ఏ బ్యాంకు నుంచి డ్రా చేసిందీ, పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.