విద్యార్థినిపై అత్యాచారం.. హత్య!

Molestation attack and murder on school girl - Sakshi

     వాకింగ్‌కు వెళ్లిన 8వ తరగతి విద్యార్థిని వైష్ణవి కిడ్నాప్‌ 

     అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసినట్లు అనుమానాలు 

హైదరాబాద్‌: రోజూలాగే ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. అదే రోజు సాయంత్రం నుంచి కూతురు కోసం పరిసర ప్రాంతమంతా గాలిస్తున్న తల్లిదండ్రులకు సోమవారం విగతజీవిగా కనిపించింది. హైదరాబాద్‌ మేడిపల్లి ఠాణా పరిధిలోని బడంగ్‌పేటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. తల, ముఖం, శరీరంపై తీవ్రగాయాలై ఉండటంతో దుండుగులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం నివేదిక ఆధారంగానే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ బ్రహ్మణపల్లికి చెందిన అనసూయ, ప్రభు కుటుంబం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు.

బడంగ్‌పేటలోని రాజీవ్‌ గృహకల్ప 10వ బ్లాక్‌లో మూడేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె వేవూరి వైష్ణవి (14) జిల్లెలగూడలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ప్రతిరోజూలాగే ఆదివారం ఉదయం ఆరు గంటలకు వాకింగ్‌ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న తల్లి అనసూయ సాయంత్రం ఇంటికి వచ్చింది. కూతురు కనిపించకపోవడంతో విష యం దినసరీ కూలీగా పనిచేసే భర్తకు తెలిపింది. దీంతో వీరు స్థానికులతో కలసి వైష్ణవి స్నేహితులను, బంధువులను వాకబు చేసినా జాడ తెలియలేదు. దీంతో రాత్రి ఏడు గంటలకు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. అయితే సోమవారం ఉదయం ఆరు గంటలకు రాజీవ్‌ గృహకల్పలోని అంగన్‌వాడీ భవనం పక్కన ఓ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనసూయ, ప్రభు దంపతులకు విషయాన్ని తెలియజేశారు. వారు అక్కడి వెళ్లి చూడగా తల, ముఖం, శరీరంపై తీవ్రగాయాలతో వైష్ణవి జీవచ్ఛవంగా పడి ఉంది. కూతురిని ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదు కుని రోదించడం అందరినీ కలచివేసింది.  

ఆటోలో తీసుకొచ్చి మృతదేహాన్ని పడేశారు... 
దుండగులు వైష్ణవిని ఉదయాన్నే కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం చేసిన అనంతరం ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి ఆమెను నీటిలో ముంచి శ్వాస ఆగిపోయేలా చేసి చంపినట్లు భావిస్తు న్నారు. ఈ క్రమంలోనే ఆమెను శరీరంపై తీవ్ర గాయాలై ఉంటాయని అనుమానిస్తున్నారు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక మృతదేహా న్ని ఆటోలో తీసుకువచ్చి డ్వాక్రా భవనం పక్క న పడేసి వెళ్లిపోయి ఉండచ్చని  భావిస్తున్నా రు. ఘటనాస్థలంలో ఆటో టైర్ల అచ్చులను గమనించిన పోలీసులు ఓ ఆటోవాలాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సాధ్యమైనంత తొందరగా నిందితులను పట్టుకుంటామని మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ మన్‌మోహన్‌ తెలిపారు. 

తెలిసినవారి పనేనా? 
డ్వాక్రా భవనం పక్కనే కమ్యూనిటీ చర్చి ఉంది. చర్చికి నలువైపుల సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే దుండగులకు ఈ సీసీ కెమెరాల సంగతి ముందే తెలిసి ఉంటుందని అందుకే ఆటోను చర్చి ముందు నుంచి కాకుండా గల్లీల నుంచి తీసుకువచ్చి.. అదేదారిలో వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. అంటే రాజీవ్‌ గృహకల్పలో ఉండే వారేగాక ఆ ప్రాంతం గురించి తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని, ఇది కచ్చితంగా తెలిసిన వారి పనేనని పోలీసులు భావిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top