లక్కవరపుకోటలో దారుణం..

Minor Girl suspicious death in Srikakulam - Sakshi

అనుమానాస్పదస్థితిలో బాలిక మృతి

ప్రేమికుడిపై అనుమానం..

కాలిన గాయాలతో కేంద్రాస్పత్రిలో ప్రత్యక్షమైన అనుమానితుడు

శ్రీకాకుళం, లక్కవరపుకోట: పోలీస్‌ స్టేషన్‌కు కూత వేటలోనే దారుణం జరిగింది.  రంగరాయపురం గ్రామానికి చెందిన  పిల్లా శ్యామల (16) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గడిచిన రెండు నెలల్లో నియోజకవర్గ పరిధిలో ఇద్దరు బాలికలు హత్యకు గురికాగా... మరో ఇద్దరు బాలికలు శారీరక హింసకు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. విజయగనగరం డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, ఎస్‌.కోట సీఐ బి. వెంకటరావు, మృతురాలి బంధువులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగరాయపురం గ్రామానికి చెందిన పిల్లా శ్యామల ఎస్‌.కోట పట్టణంలో గల పుణ్యగిరి ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం (సీఈసీ) చదువుతోంది. నిత్యం బస్సులో కళాశాలకు వస్తోంది.

ఈ క్రమంలో మంగళవారం కళాశాలకు వెళ్లిన శ్యామల ఇంటికి చేరుకోలేదు. కొత్తూరులో ఉన్న పెద్దమ్మ దగ్గరకు శ్యామల వెళ్లి ఉంటుందని తల్లి వరలక్ష్మి భావించింది. కాగా బుధవారం ఉదయం ఎల్‌.కోట పోలీస్‌స్టేషన్‌ వెనుకగల శ్మశానంలో బోర్లా పడి ఉన్న శ్యామలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే పోలీసులు వచ్చి పరిశీలించగా శ్యామల అప్పటికే మృతి చెందింది. మృతదేహం పక్కనే సగం కాలి ఉన్న వాటర్‌బాటల్‌లో పెట్రోల్‌ ఉంది. అలాగే శ్యామల కాలేజ్‌ బ్యాగ్‌ పాక్షికంగా కాలిపోయి ఉంది. దీంతో విజయగనరం నుంచి డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌ సభ్యులు వచ్చి సంఘటనా స్థలలో వివరాలు సేకరించారు. మృతురాలు వీపుపై కాలిన గాయలు, గోళ్లతో రక్కినట్లు ఆనవాలు న్నాయి. మృతురాలి తండ్రి చిన్నప్పుడే మృతి చెందగా తల్లి వరలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు అమ్మాయిలను (దేవి, శ్యామల) పెంచుకుంటూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్న కుమార్తె చనిపోవడంతో గుండలవిసేలా రోదిస్తున్న వరలక్ష్మిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు.

రాముపై అనుమనాలు
ఇదిలా ఉంటే ఎల్‌.కోట గ్రామానికి చెందిన మజ్జి రాము అనే యువకుడు తన కుమార్తెను హత్య చేసి ఉండవచ్చని మృతురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది.  గతంలో రాము పలుమార్లు శ్యామల వెంటపడేవాడని... రెండు,మూడు పర్యాయాలు మందలించినట్లు మృతురాలు బంధువులు తెలి పారు. డాగ్‌ స్క్వాడ్‌ కూడా అనుమానితుడు ఇంటి పరిసరాలకు వెళ్లి ఆగడంతో రాముపై అనుమానాలెక్కువయ్యాయి. విచారణ వేగవంతం చేసి త్వరలోనే నిందితుడ్ని అరెస్ట్‌ చేస్తామని  డీఎస్పీ, సీతో పాటు ఎల్‌.కోట ఎస్సై  శ్రీనివాస్‌ తెలిపారు.

కాలిన గాయాలతో ఆస్పత్రిలో ప్రత్యక్షం..
 శ్యామల మృతికి సంబంధించిన కేసులో అనుమానితుడిగా భావిస్తున్న మజ్జి రాము కాలిన గాయాలతో విజయనగరం కేంద్రాస్పత్రిలో ప్రత్యక్షమయ్యాడు.  బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో సుమారు 50 శాతం కాలిన గాయాలతో ఉన్న రాముని తల్లి సీత, తమ్ముడు విజయ్‌కుమార్‌ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం తెల్లవారుజూము ఇంటి వద్ద చలి మంట వేసుకున్నామని.. ప్రమాదవశాత్తూ రాము మంటలో పడిపోయాని తల్లి తెలిపింది.

 కఠినంగా శిక్షించాలి
బాలిక అనుమానాస్పద మృతి విషయం తెలుసుకున్న ఎల్‌.కోట, రంగరాయపురం గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. గతేడాది నవంబర్‌ నెలలో ఎస్‌.కోట మండలం బొడ్డవర వద్ద చిన్నారిపై అగంతకుడు హత్యాయత్నం.. డిసెంబర్‌ నెలలో ఎల్‌.కోట మండలం గంగుబూడి గ్రామం వద్ద డిగ్రీ చదువుతున్న బాలిక మృతి... వేపాడ మండలంలో ఒక బాలికపై హత్యాయత్నం... ప్రస్తుతం శ్యామల హత్యకు గురికావడంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top