14 ఏళ్ల క్రితం ఆలయం వద్ద దొరికిన శిశువు
ఆడ పిల్లలు లేకపోవడంతో అక్కున చేర్చుకున్న మహిళ
తమ్ముడే అకృత్యానికి పాల్పడినట్టు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు
ధర్మవరం అర్బన్: ఆ తల్లికి ఇద్దరు మగ పిల్లలు. దర్శనం కోసం బోయకొండ గంగమ్మ ఆలయానికి వెళ్లగా అక్కడ ఓ ఆడశిశువు ఏడుస్తూ కనిపించింది. ఎవరిని అడిగినా వారి బిడ్డ కాదన్నారు. దీంతో ఆమె అమ్మవారే తనకు బిడ్డను ఇచ్చారనుకుని ఇంటికి తెచ్చుకుని పెంచింది. ఇప్పుడా చిన్నారికి 14 ఏళ్లు. అయితే.. పెంచిన తల్లి తమ్ముడే ఆ పసిమొగ్గను తుంచేశాడు. కామంతో కళ్లుమూసుకుపోయి తరచూ బాలికపై అత్యాచారం జరిపాడు. చివరికి బాలిక గర్భం దాలి్చంది.
వివాహమై ముగ్గురు పిల్లలున్నా..
ఆరో తరగతి వరకు చదివిన ఆ బాలిక ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. పెంచిన తండ్రి అనంతపురంలో ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. పెంపుడు తల్లి రెండో తమ్ముడు సాకే నరసింహ (వరుసకు మేనమామ) ఆ సమీపంలోని కాలనీలోనే నివసిస్తున్నాడు. అతనికి వివాహం కాగా.. ముగ్గురు పిల్లలున్నారు. అక్క కూలి పనులకు వెళ్లిన సమయంలో బాలికను తన ఇంటివద్ద చెత్త ఊడ్చేందుకు, ఇల్లు శుభ్రం చేసేందుకు తీసుకుని వెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట చెబితే చంపుతానని బెదిరించాడు. దీంతో బాలిక ఎవరికీ చెప్పలేదు.
రెండు రోజుల క్రితం కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను తల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఐదు నెలల గర్భవతి అని చెప్పారు. దీంతో ఆమె బోరున విలపించింది. బాలికను మందలించి విషయం ఆరా తీయగా.. మేనమామ సాకే నరసింహ దీనికి కారణమని చెప్పింది. దీంతో తల్లి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రితోపాటు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి పంపించి వైద్యం చేయించారు. సాకే నరసింహను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


