ఎలా వచ్చాడో.. అలాగే వెళ్ళాడు.. | Massive Diamond Robbery In Subbarami Reddy Relatives House At Banjara Hills | Sakshi
Sakshi News home page

డైమండ్స్‌ చోరీ

Aug 28 2019 2:09 AM | Updated on Aug 28 2019 11:20 AM

Massive Diamond Robbery In Subbarami Reddy Relatives House At Banjara Hills - Sakshi

బంజారాహిల్స్‌: కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి అన్న కుమారుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు రెండు కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను ఓ దొంగ దోచుకెళ్లాడు. ప్రముఖ బిల్డర్‌ అయిన తిక్కవరపు ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. ఉత్తమ్‌ తన కుటుంబంతో కలసి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి భోజనం ముగించుకుని కుటుంబ సభ్యులంతా నిద్ర పోయారు. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంటి వెనుక ఉన్న జపనీస్‌ గార్డెన్‌ ప్రహరీ గోడపై నుంచి దూకి ఆగంతకుడు ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించాడు.

ఆ తర్వాత ఇంటి వెనుకవైపు ఉన్న అద్దం తలుపు తాళాన్ని స్క్రూ డ్రైవర్‌తో తొలగించి లోపలికి ప్రవేశించాడు. హాల్‌లో నుంచి మెట్లు ఎక్కి.. మొదటి అంతస్తులోని ఉత్తమ్‌రెడ్డి బెడ్‌రూంలోకి వెళ్లాడు. ఆ బెడ్‌రూం పక్కనే ఉన్న చిన్న సందు ద్వారా ముందుకు వెళ్తే కప్‌బోర్డు ఉంది. దాని తాళాలు పగులగొట్టి వజ్రాభరణాలను తీసుకుని వచ్చిన దారినే దొంగ ఉడాయించాడు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఉత్తమ్‌ భార్య శ్రీలతారెడ్డి లేచి చూడగా.. ఇల్లంతా చిందర వందరగా కనిపించింది. దీంతో వెంటనే కప్‌బోర్డును తెరిచి చూడగా.. అందులో ఉన్న ఆభరణాలు కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులకు విషయం చెప్పగా.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.రవికుమార్, డీఎస్‌ఐ భరత్‌ భూషణ్‌ ఆధ్వర్యంలో క్రైం బృందం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. పోలీసు జాగిలాలతో నిందితుడి జాడ వెతికారు. జాగిలాలు జపనీస్‌ ప్రహారీ గోడ వరకు వెళ్లి తిరిగి వచ్చాయి.

ఇవాళే బ్యాంకులో పెడదామని..
గత ఆదివారం శుభకార్యం ఉండటంతో బ్యాంకు లాకర్‌ నుంచి శ్రీలతారెడ్డి ఆభరణాలు తెచ్చుకున్నారు. శుభకార్యం అయిపోయిన తర్వాత ఆభరణాలను తన బెడ్‌రూమ్‌లోని కప్‌బోర్డులో భద్రపరిచారు. మంగళవారం ఆభరణాలను తిరిగి బ్యాంకు లాకర్‌లో పెట్టాలని భావించారు. కానీ అంతలోనే ఇలా చోరీకి గురయ్యాయి.

ముసుగు ధరించిన దొంగ..
దొంగ ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. రెండు గంటల ప్రాంతంలో ఇంటి లోపలికి వెళ్లిన ఆగంతకుడు.. 4 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే తెలుస్తోంది. దొంగతనానికి పాల్పడిన ఆగంతకుడి వయసు 30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. జీన్స్‌ ప్యాంట్, టీషర్ట్‌ ధరించిన దొంగ ముఖానికి ముసుగు వేసుకొని చేతులకు గ్లౌజ్‌లు తొడుక్కున్నట్లుగా కనిపిస్తోంది. కాళ్లకు మాత్రం షూస్, చెప్పులు ధరించలేదు. ఎలాంటి ఆధారాలు లభించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు దొంగ కదలికలను బట్టి తెలుస్తోంది. దొంగతనంలో ఒక్కడే పాల్గొన్నట్లు స్పష్టంగా కనిపించడంతో పాత నేరస్తుల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. ఏడాది కింద ఎమ్మెల్యే కాలనీలో దొంగతనానికి పాల్పడిన సత్తిరెడ్డి అనే నేరస్తుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎలా వచ్చాడో.. అలాగే వెళ్ళాడు..
వెనుకవైపు నుంచి ఇంట్లోకి వచ్చిన ఆగంతకుడు ఇళ్లంతా కలియదిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇంటి ప్రధాన గేటు వద్దకు కూడా వచ్చిన దొంగ.. అక్కడినుంచి కాకుండా వచ్చిన దారి గుండానే వెళ్లిపోయాడు. మెయిన్‌ డోర్‌ నుంచి లోపలికి వెళ్దామని ప్రధాన గేటు వద్దకు రాగా.. సెక్యూరిటీ గార్డు నిద్రిస్తున్నట్లు గమనించి మెయిన్‌డోర్‌ తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వెంటనే వెనుక గేటులో నుంచి లోపలికి ప్రవేశించాడు.

ఉత్తమ్‌ దంపతులు రోజూ రాత్రి 8 గంటలకు పడుకొని తెల్లవారుజామున 3.30 గంటలకు లేస్తారు. అయితే ఘటన జరిగిన రోజు మాత్రం 5 గంటల దాకా నిద్రపోవడంపై తమపై మత్తు ప్రయోగం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇంకోవైపు రోజూ తలుపు వేసుకుని పడుకునే ఉత్తమ్‌ దంపతులు ఈ రోజు మాత్రం డోర్‌ వేసుకోలేదు. తాళం చెవులు ఉన్న బ్యాగును ఉత్తమ్‌ తన దిండు వద్ద పెట్టుకున్నాడు. ఆ బ్యాగులో నుంచి దొంగ తాళాలు తీసుకొని కప్‌బోర్డ్‌లు తెరిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement