breaking news
diamond theft
-
వృద్ధుడిని బంధించి.. విలువైన వజ్రం అపహరణ
కడప అర్బన్: కడప శివార్లలోని ఓ ఇంటిలో అద్దెకు దిగిన ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిపై దాడి చేశారు. బాధితుడిని నిర్బంధించి, అతడి వద్ద రూ.లక్షల విలువైన వజ్రాన్ని తీసుకుని పరారయ్యారు. కడపలోని చిలకలబావి వీధికి చెందిన భుట్టో ఎలక్ట్రానిక్స్ నిర్వాహకుడు ఆసిఫ్ ఆలీఖాన్. అతడి తండ్రి ఖాదర్ బాషా(60) 2009లో చెన్నైలో 113 కేరట్ల బరువున్న ఎల్లో సఫైర్ డైమండ్‌ను (జాతి రత్నం) రూ.25,000కు కొనుగోలు చేశాడు. ఖాదర్ బాషాకు నిందితుల్లో ఒకడైన షాహీద్ హుసేన్తో పరిచయం ఏర్పడింది. షాహీద్ హుసేన్ రత్నాల వ్యాపారంలో మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. ఖాదర్‌బాషా వద్ద విలువైన డైమండ్ ఉందని తెలుసుకున్నాడు. షాహీద్ హుసేన్ ఈ నెల 15న కడప శివార్లలో ఓ ఇంటిలో అద్దెకు దిగాడు. 16న ఉదయం ఖాదర్‌బాషా నిందితులు అద్దెకు ఉంటున్న ఇంటికి వజ్రం తీసుకుని వెళ్లాడు. ఖాదర్‌బాషా నుంచి నిందితులు వజ్రాన్ని బలవంతంగా లాక్కుని పిడిగుద్దులు గుద్దారు. దుప్పటిలో కప్పి, ప్లాస్టర్‌తో చుట్టి బాత్రూంలో పడేశారు. కొంతసేపటికి ఖాదర్‌బాషా స్పృహలోకి వచ్చి తన పిల్లలకు ఫోన్ చేశాడు. వారు వచ్చి ఖాదర్‌బాషాను రిమ్స్‌లో చేర్చారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. -
ఎలా వచ్చాడో.. అలాగే వెళ్ళాడు..
బంజారాహిల్స్: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి అన్న కుమారుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు రెండు కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను ఓ దొంగ దోచుకెళ్లాడు. ప్రముఖ బిల్డర్ అయిన తిక్కవరపు ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. ఉత్తమ్ తన కుటుంబంతో కలసి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి భోజనం ముగించుకుని కుటుంబ సభ్యులంతా నిద్ర పోయారు. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంటి వెనుక ఉన్న జపనీస్ గార్డెన్ ప్రహరీ గోడపై నుంచి దూకి ఆగంతకుడు ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఇంటి వెనుకవైపు ఉన్న అద్దం తలుపు తాళాన్ని స్క్రూ డ్రైవర్‌తో తొలగించి లోపలికి ప్రవేశించాడు. హాల్లో నుంచి మెట్లు ఎక్కి.. మొదటి అంతస్తులోని ఉత్తమ్‌రెడ్డి బెడ్రూంలోకి వెళ్లాడు. ఆ బెడ్రూం పక్కనే ఉన్న చిన్న సందు ద్వారా ముందుకు వెళ్తే కప్బోర్డు ఉంది. దాని తాళాలు పగులగొట్టి వజ్రాభరణాలను తీసుకుని వచ్చిన దారినే దొంగ ఉడాయించాడు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఉత్తమ్ భార్య శ్రీలతారెడ్డి లేచి చూడగా.. ఇల్లంతా చిందర వందరగా కనిపించింది. దీంతో వెంటనే కప్బోర్డును తెరిచి చూడగా.. అందులో ఉన్న ఆభరణాలు కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులకు విషయం చెప్పగా.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్, డీఎస్ఐ భరత్ భూషణ్ ఆధ్వర్యంలో క్రైం బృందం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. పోలీసు జాగిలాలతో నిందితుడి జాడ వెతికారు. జాగిలాలు జపనీస్ ప్రహారీ గోడ వరకు వెళ్లి తిరిగి వచ్చాయి. ఇవాళే బ్యాంకులో పెడదామని.. గత ఆదివారం శుభకార్యం ఉండటంతో బ్యాంకు లాకర్ నుంచి శ్రీలతారెడ్డి ఆభరణాలు తెచ్చుకున్నారు. శుభకార్యం అయిపోయిన తర్వాత ఆభరణాలను తన బెడ్రూమ్లోని కప్‌బోర్డులో భద్రపరిచారు. మంగళవారం ఆభరణాలను తిరిగి బ్యాంకు లాకర్లో పెట్టాలని భావించారు. కానీ అంతలోనే ఇలా చోరీకి గురయ్యాయి. ముసుగు ధరించిన దొంగ.. దొంగ ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. రెండు గంటల ప్రాంతంలో ఇంటి లోపలికి వెళ్లిన ఆగంతకుడు.. 4 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే తెలుస్తోంది. దొంగతనానికి పాల్పడిన ఆగంతకుడి వయసు 30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. జీన్స్ ప్యాంట్, టీషర్ట్ ధరించిన దొంగ ముఖానికి ముసుగు వేసుకొని చేతులకు గ్లౌజ్‌లు తొడుక్కున్నట్లుగా కనిపిస్తోంది. కాళ్లకు మాత్రం షూస్, చెప్పులు ధరించలేదు. ఎలాంటి ఆధారాలు లభించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు దొంగ కదలికలను బట్టి తెలుస్తోంది. దొంగతనంలో ఒక్కడే పాల్గొన్నట్లు స్పష్టంగా కనిపించడంతో పాత నేరస్తుల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. ఏడాది కింద ఎమ్మెల్యే కాలనీలో దొంగతనానికి పాల్పడిన సత్తిరెడ్డి అనే నేరస్తుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలా వచ్చాడో.. అలాగే వెళ్ళాడు.. వెనుకవైపు నుంచి ఇంట్లోకి వచ్చిన ఆగంతకుడు ఇళ్లంతా కలియదిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇంటి ప్రధాన గేటు వద్దకు కూడా వచ్చిన దొంగ.. అక్కడినుంచి కాకుండా వచ్చిన దారి గుండానే వెళ్లిపోయాడు. మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్దామని ప్రధాన గేటు వద్దకు రాగా.. సెక్యూరిటీ గార్డు నిద్రిస్తున్నట్లు గమనించి మెయిన్‌డోర్ తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వెంటనే వెనుక గేటులో నుంచి లోపలికి ప్రవేశించాడు. ఉత్తమ్ దంపతులు రోజూ రాత్రి 8 గంటలకు పడుకొని తెల్లవారుజామున 3.30 గంటలకు లేస్తారు. అయితే ఘటన జరిగిన రోజు మాత్రం 5 గంటల దాకా నిద్రపోవడంపై తమపై మత్తు ప్రయోగం చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇంకోవైపు రోజూ తలుపు వేసుకుని పడుకునే ఉత్తమ్ దంపతులు ఈ రోజు మాత్రం డోర్ వేసుకోలేదు. తాళం చెవులు ఉన్న బ్యాగును ఉత్తమ్ తన దిండు వద్ద పెట్టుకున్నాడు. ఆ బ్యాగులో నుంచి దొంగ తాళాలు తీసుకొని కప్బోర్డ్లు తెరిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. -
థ్రిల్లర్: 'దొంగ' చైనీయులు ఎలా దొరికారంటే!
ముంబై: ఇద్దరు చైనీయులు తమ అతి తెలివితో చేతివాటం ప్రదర్శించబోయి అడ్డంగా దొరికిపోయారు. ముంబై గోరేగావ్‌లో జరుగుతున్న వజ్రాల ప్రదర్శనకు హాజరైన ఈ ప్రబుద్ధులు.. రూ. 34 లక్షల విలువైన వజ్రాన్ని దొంగలించారు. ఎవరికీ అనుమానం రాకుండా అసలైన వజ్రాన్ని దొంగలించి.. దాని స్థానంలో నకిలీది పెట్టి ఉడాయించారు. వెంటనే ఢిల్లీ మీదుగా హాంగ్‌కాంగ్ చెక్కేసేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకొన్నారు. మరికాసేపైతే చైనా దొంగలు తప్పించుకొనే వాళ్లే.. కానీ సీఐఎస్ఎఫ్, ఇమ్మిగ్రేషన్ మొదలు విమానాశ్రయం భద్రతా అధికారుల వరకు వివిధ ఏజెన్సీలు అత్యంత సమన్వయంతో వ్యవహరించడంతో చైనీయులు చివరిక్షణంలో ఎయిర్‌పోర్టులో దొరికిపోయారు. ఓ చిన్ని షాంపూ బాటిల్లో దాచిన 5.4 క్యారెట్ల వజ్రాన్ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. వివిధ ఏజెన్సీలు సమన్వయంగా వ్యవహరించి ఛేదించిన ఈ కేసులో వాట్సాప్ వంటి మొబైల్ యాప్స్ బాగా ఉపయోగపడ్డాయి. గత నెల 27 నుంచి 31 వరకు గోరేగావ్‌లో ఇండియా ఇంటర్నేషనల్ జుయల్లరీ షో-2017 జరిగింది. ఈ షోలోకి ఎంట్రీకి రూ. 9వేలు టికెట్‌గా నిర్ణయించారు. చివరిరోజు సోమవారం ఈ ప్రదర్శనకు వచ్చిన ఇద్దరు చైనీయులు పీ కీర్తిలాల్ అండ్ కో స్టాల్లో తెలివిగా వజ్రాన్ని కొట్టేసి.. దానిస్థానంలో నకిలీది పెట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన నిర్వాహకులు మధ్యాహ్నం 3.45 గంటల ప్రాంతంలో ఈ ప్రదర్శనకు భద్రత అందిస్తున్న సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్)కు సమాచారం. నిర్వాహకులు ఇచ్చిన సమాచారాన్ని, సీసీ కెమెరాల్లోని చైనీయుల దృశ్యాలను వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులు ..వాట్సాప్ ద్వారా పోలీసులకు, ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ అధికారులకు పంపించింది. అదేవిధంగా ఫారెనర్ రిజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్వో)కు, ఎయిర్‌పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు కూడా సమాచారాన్ని పంపించారు. దీంతో అత్యంత సమన్వయంగా వ్యవహరించిన ఈ ఏజెన్సీల అధికారులు సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో ముంబై ఎయిర్‌పోర్టులో ఇద్దరు చైనీయులను గుర్తించారు. వారు రాత్రి 7.45 గంటలకు ఢిల్లీ మీదుగా హాంగ్‌కాంగ్ వెళ్లే విమానం కోసం వచ్చారు. వెంటనే వారిని అరెస్టు చేసిన ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది.. వారి వద్ద నుంచి దొంగలించిన వజ్రాన్ని స్వాధీనం చేసుకుంది.