
రాజమహేంద్రవరం రూరల్: మసీదులో నిద్రిస్తున్న మౌజన్ హత్యకు గురవడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉద్రిక్త త నెలకొంది. బిహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఫారూఖ్ (61) మూడు నెలల క్రితం రాజమహేంద్రవరం లాలాచెరువులోని నూరానీ మసీదులో మౌజన్ (చిన్నగురువు)గా చేరి అక్కడే ఉంటున్నాడు.
శుక్రవారం తెల్లవారు జామున 4.30 గంటలకు ఇమామ్ అబ్దుల్ హసీఫ్ గేటు తీసి లోపలికి వెళ్లి చూడగా ఫారూఖ్ తలపై బలమైన గాయాలతో మృతిచెంది కనిపించాడు. అక్కడ ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ కాల్చివేసి ఉండటంతో పాటు ప్రార్థనాస్థలం అగ్నికి ఆహుతై ఉన్నాయి. ఇమామ్ మసీదు కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.