వివాహిత అనుమానాస్పద మృతి

Married Women Suspicious Death in Vijayawada - Sakshi

అదనపు కట్నం కోసం వేధింపులు

భర్తే హత్యచేశాడంటూ మృతురాలి కుటుంబసభ్యుల ఆరోపణ

కృష్ణలంక(విజయవాడ తూర్పు): అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రీ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సంకాబత్తుల తారకరాము (రాము)కు విద్యాధరపురానికి చెందిన స్రవంతి(28)తో తొమ్మిదేళ్ల కిందట వివాహం అయ్యింది. వీరు ఐదేళ్ల పవిత్ర, మూడేళ్ల ఉపాసనల సంతానంతో కృష్ణలంక రాణిగారితోటలో నివాసముంటున్నారు.  రాము కూల్‌డ్రింక్స్‌ డిస్టిబ్యూషన్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల చెడు వ్యసనాలకు బానిస అయ్యి అప్పులపాలయ్యాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ తరచూ భార్య స్రవంతితో గొడవలు పడుతున్నాడు.

ఈ క్రమంలో శనివారం స్రవంతి తండ్రి నూతన గృహప్రవేశ వేడుకకు రావాల్సిందిగా రాముకు ఫోన్‌ చేసి ఆహ్వానించిన క్రమంలో తనకు రూ. 2లక్షలు ఇస్తేనే వస్తానంటూ తేల్చిచెప్పాడు. ఈ విషయంపై భార్య, భర్తలకు తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఆదివారం ఉదయం 11గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అదే రోజు రాత్రీ 11గంటల సమయంలో రాము ఇంటికి రాకపోవడంతో అతని ఇంటి పైఅంతస్తులో నివాసముండే అతని సోదరుడు వెళ్లి తలుపు కొట్టడంతో రాము కూతురు తలుపు తీసింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్‌రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో స్థానికుల సహాయంతో కిందికి దించి దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి భర్త రాముతోపాటు వారి తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, సుధారాణిలను అదుపులోకి తీసుకుని 498 సెక్షన్‌కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇది ముమ్మాటికీ హత్యే..
మృతురాలి భర్త రాము చెడు వ్యసనాలకు బానిస అవ్వడంతో పాటు ఇటీవల ఒక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు, దీనిపై తరచూ వారి మధ్య గొడవలు జరుగుతుండేవని, భార్య అడ్డు తొలగించుకునేందుకు అతనే తన బిడ్డను దారుణంగా కొట్టి హత్యచేసి ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి తన బిడ్డ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top