
సతివాడ క్రాంతి(ఫైల్)
శ్రీకాకుళం, సరుబుజ్జిలి/భామిని: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో కొండవలస గ్రామానికి చెందిన సతివాడ క్రాంతి(24) మృతి చెందింది. మృతురాలి భర్త సతివాడ రామకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం... తమ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) ర్వేల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో సింహాచలం దైవదర్శనంకు బయలుదేరారు. క్రాంతికి ఆకస్మికంగా వాంతులు రావడంతో ట్రైన్ డోరువద్ద తలబయటకు పెట్టి వాంతులు చేస్తుండగా విజయనగరం జిల్లా కోరుకొండ స్టేషన్ దాటిన తర్వాత అలమండ–భీమసింగి మధ్య బ్రిడ్జి వద్ద ఇనుప చువ్వలు తలకు బలంగా తగిలాయి.
వెంటనే ట్రైన్‌లో కూలపడిపోవడంతో సమీపంలో ఉన్న మిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అందరితో కలివిడిగా ఉండే క్రాంతి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతురాలు క్రాంతి భామినికి చెందిన పోతల శేషగిరి, జయమ్మ దంపతుల మూడవ కుమార్తె. రెండేళ్ల క్రితం కొండవలసకు చెందిన సతివాడ రామకృష్ణతో వివాహమైంది. మొదటి కాన్పులో బాబుకు జన్మనిచ్చిన ఈమె గతనెల భామిని నుంచి కొండవలసలోని అత్తవారింటికి వెళ్లింది. మరణ వార్త విన్న వెంటనే ఆమె బంధువులు విజయనగరం తరలివెళ్లారు. ఈమె మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేత లావేటి విశ్వేశ్వరరావు ప్రగాఢÉý సానుభూతి ప్రకటించారు.