వైద్యం వికటించి వివాహిత మృతి

Married Woman Died With Doctors Negligance - Sakshi

హాస్పటల్‌ ఎదుట     బంధువుల ధర్నా

దిగి వచ్చిన ఆస్పత్రి యాజమాన్యం

పరిహారం చెల్లించేందుకు అంగీకారం

కానూరు (పెనమలూరు) : మోకాలికి గాయం అవ్వటంతో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన వివాహిత.. వైద్యం వికటించటంతో మృతి చెందింది. మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట బుధవారం ధర్నా చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి యాజమాన్యంతో పోలీసులు, పెద్దలు చర్చలు జరిపి మృతురాలి కుటుంబానికి పరిహారం ఇవ్వటంతో వివాదం సమసింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యనమలకుదురు భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఎండీ హనీమా (23) నాలుగేళ్ల క్రితం నజీబ్‌ను వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల వయసున్న బాబు ఉన్నాడు. రెండు నెలల క్రితం హనీమా స్కూటీ నేర్చుకుంటూ కిందపడింది. ఆమె మోకాలికి గాయమైంది. మోకాలు నొప్పి తగ్గకపోవటంతో ఈ నెల 26న కానూరు అశోక్‌నగర్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్ష చేయించుకుంది. ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్‌ చేయటానికి 27వ తేదీ మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కసారిగా కోమాలోకి వెళ్లింది. ఆమెను ఐసీయూలో ఉంచారు. ఆమె ఆరోగ్యం ఏమైందని కుటుంబ సభ్యులు అడుగగా ఆస్పత్రి యాజయాన్యం సమాధానం చెప్పలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆమె చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు.

ఆందోళనకు దిగిన బంధువులు
వైద్యం వికటించి హనీమా చనిపోయిందని, దీనికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, ఆస్పత్రిని మూయించాలని డిమాండ్‌ చేశారు. దీంతో సీఐ దామోదర్, ముస్లీం పెద్దలు వచ్చి ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. పరిహారం ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించటంతో బాధితులు ఆందోళన విరమించారు. మృతురాలి కుటుంబానికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వటానికి రాజీ కుదిరినట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top