16 ఏళ్లకే అత్తింటి ఆరళ్లు

Married Girl Harassed With Husband In Guntur - Sakshi

బాల్యంలో ఆటపాటలు పేదరికం  విసిరేసిన కష్టాల కార్ఖానాలో కలిసిపోయాయి. చదువులమ్మ గుడిలో పుస్తకాలు పట్టాల్సిన చేతులు.. మెడలో పసుపుతాడు బిగించిన దాంపత్యపు బంధాలలో చిక్కుకున్నాయి.. భర్తే సర్వస్వమంటూ చెప్పిన వేదమంత్రాలు చెవుల్లో మార్మోగుతుండగానే.. కట్టుకున్నోడి లీలలు కథలు కథలుగా వినిపించాయి. సంసారపు చదరంగంలో మొదటి పావు కదిలేలోపే అత్తింట ఆరళ్లు నూతన దాంపత్య మాధుర్యాన్ని ఎగతాళి చేశాయి. ఇంటికి వచ్చిన అడబిడ్డను మహాలక్షి్మగా భావించాల్సిన వారికి.. అదనపు కట్నకానుకలే లక్ష్మీదేవిగా కనిపించాయి. ఇలా నిత్యం మానసిక, శారీరక హింసలు మైనార్టీ కూడా తీరని నవ వధువును పుట్టింటికి తరిమేశాయి. ఇక భరించలేని తెనాలికి చెందిన ఆ ఆడబిడ్డ కన్నీళ్లు తోడుగా బుధవారం పోలీసులను  ఆశ్రయించింది.

సాక్షి, తెనాలి: కుటుంబ పరిస్థితుల నేపథ్యం అభం శుభం తెలియని చిన్నారికి వివాహం చేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకున్నారు. పేద కుటుంబం కావడంతో ఉన్నతంతలోనే వివాహం జరిపించారు. అయితే ఆ బాలికకు పెళ్లి ఆనందం మూడు రోజుల ముచ్చటే అయ్యింది. భర్త, అత్తింటి వారు పెడుతున్న హింసలను తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసింది. ఇక చేసేది లేక పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గంగానమ్మపేటకు చెందిన 16 ఏళ్ల సాహితిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన ఆటోడ్రైవర్‌ గుంజి గణేష్‌కు ఏడు నెలల క్రితం సాహితిని ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.50 వేలు కట్నం ఇచ్చారు.

వివాహమైన కొద్ది రోజులకే బాలికకు వేధింపులు మొదలయ్యయాయి. రోజూ భర్త మద్యం తాగి వచ్చి చిత్రహింసలు పెడుతున్నాడు. ఇదే సమయంలో అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఓ కేసుకు సంబంధించి కొవ్వూరు పోలీస్‌స్టేషన్‌లో భర్తను, సదరు మహిళను బైండోవర్‌ చేశారని తెలుసుకుని నివ్వెరపోయింది. దీనిపై ప్రశి్నస్తే వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. మరో వైపు రూ. రెండు లక్షలు అదనపు కట్నం తేవాలని భర్తతోపాటు అత్తింటి వారు మానసికంగా, శారీరకంగా హింసించారు. దీంతో ఆ బాలిక పుట్టింటికి వచ్చేసింది. బుధవారం భర్త గణేష్‌ అత్త విజయలక్ష్మి, మరిది సుధీర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ బత్తుల శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top