రోటీ మేకర్‌ టు గంజాయి స్మగ్లర్‌!

Marijuana Smuggling in Hyderabad - Sakshi

స్నేహితులతో కలిసి దందాకు శ్రీకారం

విశాఖ ఏజెన్సీ నుంచి 200 కేజీల గంజాయి అక్రమ రవాణా

ఇద్దరిని పట్టుకున్న ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి వలసవచ్చిన షేక్‌ ఆరిఫ్‌ సిటీలో రోటీ మేకర్‌గా మారాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం స్నేహితులతో కలిసి గంజాయి దందా మొదలెట్టాడు. విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి అక్రమంగా తీసుకువచ్చి నాందేడ్‌లో విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ దందాకు చెక్‌ చెప్పిన ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ సోమవారం వెల్లడించారు. వీరి నుంచి 200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాందేడ్‌కు చెందిన షేక్‌ ఆరిఫ్‌ నగరానికి వలసవచ్చి ఛత్రినాక ప్రాంతంలో స్థిరపడ్డాడు. అదే ఏరియాలో రోటీ మేకర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఇందులో వచ్చే డబ్బు సరిపోకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఈ విషయాన్ని నాందేడ్‌కు చెందిన తన స్నేహితుడు అష్వఖ్‌కు చెప్పడంతో అతను గంజాయి అక్రమ రవాణా చేస్తే భారీ లాభాలు ఉంటాయని సూచించాడు. ఇందుకు ఆరిఫ్‌ అంగీకరించడంతో అష్వఖ్‌ విశాఖ ఏజెన్సీకి చెందిన తన స్నేహితుడు శ్రీకాంత్‌ను సంప్రదించి గంజాయి సమకూర్చాలని చెప్పడంతో అతను అంగీకరించాడు. కొన్ని రోజుల క్రితం ఆరిఫ్‌ నాందేడ్‌కే చెందిన షేక్‌ సమీర్‌తో కలిసి కారులో విశాఖ ఏజెన్సీకి వెళ్ళాడు. శ్రీకాంత్‌ నుంచి 200 కేజీల గంజాయి ఖరీదు చేసి వేర్వేరుగా ప్యాక్‌ చేయించాడు. దీనిని కారు డిక్కీ, వెనుక సీట్ల వద్ద పెట్టుకుని సిటీకి తీసుకువచ్చిన వీరు ఆదివారం ఛత్రినాకలోని ఆరిఫ్‌ ఇంట్లో బస చేశారు. సోమవారం నాందేడ్‌ వెళ్లడానికి సిద్ధం కాగా దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ నేతృత్వంలో ఎస్సైలు పి.రమేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, సి.వెంకటేష్‌ తమ బృందాలతో దాడి చేసి ఆరిఫ్, సమీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి గంజాయి, కారు స్వాధీనం చేసుకుని కేసును ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న అష్వఖ్, శ్రీకాంత్‌ల కోసం గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top