తహసీల్దార్‌ కార్యాలయంలో పెట్రోల్‌తో అలజడి 

Man went with Patrol to tehsildar office for suicide attempt - Sakshi

వివాదాస్పద స్థలం తన పేరుపై మార్చాలని వినతి

స్పందించలేదని పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునే యత్నం

ఆగంతకుడిని అడ్డుకున్న సిబ్బంది  

కొండాపురం: తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే వైఎస్సార్‌ జిల్లా కొండాపురం  తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం అలాంటి ఘటన చోటుచేసుకుంది. అధికారులు, సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దత్తాపురం గ్రామానికి చెందిన బుడిగ ఆదినారాయణ మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి పెట్రోలు పోసుకోవడంతో వెంటనే చుట్టూ ఉన్న వారు అతని చర్యలను అడ్డుకున్నారు. బయటకు తీసుకెళ్లి అతనిపై నీళ్లు పోసి ప్రమాదం తప్పించారు.

ఆదినారాయణ తన తల్లి పేరు మీద ఉన్న డీకేటీ భూమిని తన పేరిట మార్చి నష్ట పరిహారం చెల్లించాలని వీఆర్‌వో, తహసీల్దార్‌ను గతంలో కోరాడు. అదే భూమి ఎరికల గారి నరసింహులు ఆక్రమించాడని 2009లో హైకోర్టులో ఆదినారాయణ పిటిషన్‌ వేయగా ఆ కేసు నడుస్తోంది. అయినా ఆ పొలాన్ని తన పేరిట మార్చాలని తహసీల్దార్‌కు ఇటీవల వినతిపత్రం ఇచ్చాడు. వారు స్పందించకపోవడంతో   అధికారులపై పెట్రోలు పోసి నిప్పంటించి.. తానూ ఆత్మహత్య చేసుకోవాలని ఈ చర్యకు పాల్పడినట్లు ఆదినారాయణ చెప్పాడు. పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హజీవలీ తెలిపారు.  

సరైన పత్రాలు లేవు 
బుక్కపట్నం రెవెన్యూ పొలంలో ఖాతా నంబర్‌ 789, సర్వే నంబర్‌ 122లో 3.61 ఎకరాల భూమికి ఆదినారాయణ నకిలీ పాసు పుస్తకం తయారు చేసుకున్నాడని తహసీల్దార్‌ తెలిపారు. ఆ పొలంపై ఆదినారాయణకు ఎలాంటి హక్కులు లేకున్నా అధికారులను బెదిరిస్తున్నాడని తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top