
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో వసంత్‌కుంజ్ ప్రాంతంలో బస్సులో విద్యార్థిని పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా వ్యవహరించాడు. సీటులో కూర్చున్న మహిళ వద్దకు వెళ్లి జననాంగాన్ని చూపుతూ అమర్యాదకరంగా వ్యవహరించాడు. బాధితురాలు తేరుకుని దుండగుడిని తీవ్రంగా ప్రతిఘటించింది. సాయాన్ని కోరుతూ అరిచినా తోటి ప్రయాణీకులు స్పందించలేదు. ధైర్యంగా అతడిని ఎదుర్కొన్న యువతి పోలీసులను పిలవడంతో పాటు కామాంధుడిని తీవ్రంగా కొడుతూ బస్సు నుంచి కిందకు తోసేసింది.
మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించినందుకు దుండగుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఈ తరహా ఘటనలు ఇటీవల పలుమార్లు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బస్సులో ఢిల్లీ వర్సిటీ విద్యార్థిని ఎదుట ఓ వ్యక్తి ఇలాగే వ్యవహరించగా, బాధితురాలు వీడియోలో రికార్డు చేసి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌లో ఊబర్ ప్రయాణీకురాలి ఎదుట డ్రైవర్ అసభ్యంగా వ్యవహరించాడు. అదే నెలలో వసంత్ కుంజ్ ప్రాంతంలో ఓ టైక్వాండో ట్రైనర్ మహిళ ఎదుట ఇలాగే వ్యవహరించాడు.