ప్రాణం తీసిన అతివేగం | Man Killed Srikakulam District Bus Accident | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అతివేగం

Sep 15 2019 10:22 AM | Updated on Sep 15 2019 10:23 AM

Man Killed Srikakulam District Bus Accident  - Sakshi

ప్రమాదంలో పొలాల్లో బోల్తాపడిన చేపల వ్యాన్‌, మృత్యు శకటమైన వాహనమిదే

సాక్షి, వీరఘట్టం/పాలకొండ రూరల్‌: ఓ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తొమ్మిది మంది మత్స్యకారులను క్షతగాత్రులుగా చేసింది. కాళ్లు, చేతులు, తలకు తీవ్ర గాయాలైన వీరి రోదనతో వీరఘట్టం సమీప వెంకమ్మ చెరువు ప్రాంగణం ఒక్కసారిగా భయకంపితంగా మారింది. ఈ చెరువులో చేప పిల్లలను వదిలేసి రోడ్డుపైన చేప పిల్లల వ్యాన్‌లో తిరిగి వెళ్లి పోదామనుకున్న తరుణంలో అతివేగంతో వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు వెనుక నుంచి బలంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మత్స్యకారుడు గంటా లక్ష్మణరావు(46) బస్సు వెనుక చక్రం కింద పడి నుజ్జునుజ్జయి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం ఈ ఘోర రోడ్డు ప్రమాదాన్ని చూసిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.

 ఇలా ప్రమాదం...
సీతంపేట ఐటీడీఏ గిరిజన మత్స్యకారులకు సబ్సిడీపై చేప పిల్లలను అందజేస్తోంది. ఇందులో భాగంగా వీరఘట్టం సమీపంలో వెంకమ్మ చెరువుకు చేప పిల్లలను బూర్జ మండలం మదనాపురం తీసుకువచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో వచ్చిన చేపల వ్యాన్‌లో చేప పిల్లలను వీరఘట్టం, నీలానగరం మత్స్యకారులందరూ చెరువులో విడిచిపెట్టారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు వ్యాన్‌ సమీపంలో చేప పిల్లల లెక్కలను సరిచూసుకుంటున్నారు. ఇంతలో వెనుక నుంచి అతి వేగంతో వచ్చిన బస్సు వ్యాన్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

తీవ్ర గాయాలతో విలవిల..
వీరఘట్టానికి చెందిర మారుబిల్లి జగన్‌ తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. నీలానగరానికి చెందిన ఎస్‌ సింహాచలం, అల్లు కనకారావు తీవ్రంగా గాయపడటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వీరఘట్టం కొండవీధికి చెందిన గురిబిల్లి పోలిరాజు కుడిచేయి విరిగిపోయి, తలకు తీవ్ర గాయమైంది. గుండా దాసుకు, చేపల పంపిణీ చేసిన బీ అప్పన్నదొర, సవర గంగాధర్, వ్యాన్‌ డ్రైవర్‌ సవర దుర్గారావుతోపాటు సీతంపేటకు చెందిన  ఫిషర్‌మెన్‌ బెవర సత్యనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో వీరంతా గాయాలతో విలవిల్లాడారు. ప్రస్తుతం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

నీలానగరంలో విషాదం...
చెరువులో చేప పిల్లలను వదిలేసి మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి వచ్చేస్తానని చెప్పిన భర్త లక్ష్మణరావు మృతి చెందాడని తెలియడంతో భార్య లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. మృతుడి స్వగ్రామం నీలానగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాలకొండ ఏరియా ఆస్పత్రిలో లక్ష్మణరావు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై వీరఘట్టం ఎస్‌ఐ ఎం మధుసూదనరావు కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement