ప్రియుడే హంతకుడు.. !

Man killed Married Woman In chittoor District  - Sakshi

భానుప్రియ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు

కాల్‌ డేటా ఆధారమే కీలకం

75 రోజుల అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం

సాక్షి, రామచంద్రాపురం : ఓ వివాహితను ఆమె ప్రియుడే నమ్మించి హత్య చేసి పాతి పెట్టిన  సంఘటన 75 రోజుల అనంతరం సీ.రామాపురంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. రేణిగుంట రూరల్‌ సీఐ అమర్‌నాథ్‌ రెడ్డి తెలిపిన వివరాలు...పీవీ పురానికి చెందిన గురవయ్య కుమార్తె భాను కుమారి(28) రాయలచెరువు పేటకు చెందిన మునిశేఖర్‌ కు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి వర్షిత(7) కుమార్తె ఉంది. రెండేళ్ల క్రితం దంపతుల నడుమ మనస్పర్థలు పొడసూపడంతో భానుకుమారి పుట్టింటికి చేరింది. ఈ నేపథ్యంలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న హరికృష్ణతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆరునెలల నుంచి భాను, హరికృష్ణల మధ్య విభేదాలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో మే 7న భానుకుమారి, హరికృష్ణకు తిరుపతిలోని ఒక కాయిన్‌ బాక్స్‌ ఫోన్‌ నుంచి మాట్లాడి రామాపురానికి రావాలని కోరింది. అక్కడి నుంచి ఇద్దరూ తరచుగా కలుసుకునే అన్నాస్వామి గండిచెరువు వద్దకు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఆగ్రహించిన హరికృష్ణ, భానుకుమారి మెడకు చున్నీతో బిగించి, కిందకు తోసి, బండరాయితో తలపై మోదాడు. దీంతో భానుకుమారి ప్రాణాలు కోల్పోయింది. హరికృష్ణ వేరే ఊరిలో ఆపి ఉంచిన జేసీబీని తీసుకొచ్చి, చెరువులో గుంత తీసి, పాతి పెట్టి, ఏమీ ఎరగనట్లు ఇంటికి చేరుకున్నాడు. భానుకుమారి కోసం ఆమె తల్లిదండ్రులు గాలించినా ఫలితం లేకపోవడంతో మే 13న రామచంద్రాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వివాహిత అదృశ్యం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో అనుమానితుడు హరికృష్ణ ఫోన్‌ కాల్స్‌ డేటా ఆధారంగా అతడిని విచారణ చేశారు. భానును తానే హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. భానుకుమారిని ఖననం చేసిన ప్రాంతాన్ని చూపించాడు. తహసీల్దార్‌ వెంకటేశ్వర్‌రావు సమక్షంలో ఆ ప్రదేశాన్ని తవ్వారు. అప్పటికే భానుకుమారి మృతదేహం ఎముకల గూడుగా మారింది. పుత్తూరు ప్రాంతీయ వైద్యాధికారి డాక్టర్‌ నవీన్‌కుమార్‌ పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్‌ఐ పరమేశ్వర్‌ నాయక్‌ నిందితుడు హరికృష్ణను పుత్తూరు కోర్టులో హాజరు పరిచారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top