హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

Man gets life imprisonment for killing wife - Sakshi

విజయనగరం లీగల్‌: భార్యను హతమార్చడంతోపాటు సాక్ష్యాలను తారుమారు చేశాడన్న  ఆరోపణలు రుజువు కావడంతో కృష్ణా జిల్లా చర్లపల్లి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన గురివిందపల్లి నాగరాజుకు జీవితఖైదుతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్‌ జడ్జి ఆలపాటి గిరిధర్‌ సోమవారం తీర్పుచెప్పారు.

అలాగే హతురాలి కుటుంబ సభ్యులకు నాలుగు లక్షల రూపాయలు నష్ట పరి హారం చెల్లించాల్సిందిగా తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌ వారు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. 2006లో నాగరాజు తన పొరుగూరు రామ్‌నగర్‌ గ్రామానికి చెందిన రాధను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాడు.

అక్కడే వారికి బాబు పుట్టాడు. రెండు నెలల అనంతరం బాబును అత్తవారింట వదలి భార్యతో విజయనగరం వచ్చి స్థానిక దాసన్నపేటలో ఉన్న డాల్ఫిన్‌ హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. మూడు నెలల పాటు బాగానే ఉన్న నాగరాజు తన భార్యను ఎలా గైనా వదలించుకోవాలన్న ఉద్దేశంతో శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు.

దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడకు కొన్నాళ్ల తర్వాత ఇరువర్గాల పెద్ద మనుషులు భార్యభర్తల ను రాజీ చేయడంతో, నాగరాజు తన భార్యను 2014 అక్టోబర్‌ 27న విజయనగరం తీసుకువచ్చాడు. అదే నెల 30వ తేదీ రాత్రి భార్యతో గొడవపడి విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది.

ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం రాధ ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి ఇరుగుపొరుగు వారిని నమ్మించాడు. అత్తవారికి కూడా తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందించాడు. స్థానికుల సహాయంతో 108 వాహనంలో రాధను కేంద్రాస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారిం చారు.

దీంతో గుట్టుచప్పుడు కాకుండా భార్య మృతదేహాన్ని కారులో అత్తవారి గ్రామమైన రామ్‌నగర్‌కు తీసుకువెళ్లిపోయాడు. అక్కడ వారి సంప్రదాయ ప్రకారం మృతదేహాన్ని ఖననం చేశారు. ఖననం చేసే సమయంలో ఆమె శరీరంపై ఉన్న గాయాలను గుర్తించిన సోదరుడు కృష్ణబాబు విజయనగరం రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసిన అప్పటి సీఐ కోరాడ రామారావు దర్యాప్తు ప్రారంభిం చారు. దర్యాప్తులో నాగరాజు తన భార్యను ఉద్దేశ్యపూర్వకంగానే హతమార్చి, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడని వెల్లడైంది. అలాగే తన భర్త వేధింపులు గురిచేస్తున్నట్లు ఆమె రాసిన లెటర్‌ కూడా పోలీసులకు లభించింది.

దీంతో 2011 నవంబ రు 6వతేదీన నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రాసిక్యూషన్‌ సరైన సాక్ష్యాధారాలతో కేసు రుజువు చేయడంతో జడ్జి జీవిత ఖైదు విధించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ప్రాసిక్యూటర్లు  వై.పరశురామ్, పృథ్వీరాజ్‌లు వాదించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top