ఆశల దీపం ఆరిపోయింది!  

Man Died In Train Accident In Srikakulam  - Sakshi

ఉద్యోగం వచ్చి ఒక్క రోజైనా  కాకుండానే..

రైలు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌  ఇంజినీర్‌ మృతి

మందస/ఆమదాలవలస: ఆ తల్లిదండ్రుల ఆశల దీపం ఆరిపోయింది. కన్నకొడుకు ఉన్నత శిఖరాలను అధిరోహించి.. ఆసరాగా మారుతాడనుకుంటే కానరాని తీరాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులకు తీరని వేదనే మిగిలింది. మందస మండలం వీరగున్నమ్మపురానికి చెందిన వజ్జ వెంకటరావు, భార్య బేబిరాణి దంపతులు శ్రీకాకుళంలోని కాళింగ నెహ్రూనగర్‌లో నివాసముంటున్నారు. వృత్తిరీత్యా వెంకటరావు ఉపాధ్యాయుడు.

ఒక్కగానొక్క కుమారుడైన మదన్‌(22)ను అల్లారుముద్దుగా పెంచుకుని ఉన్నత చదువులు చదివించారు. అహ్మదాబాద్‌లోని ఎంఎన్‌ నిట్‌లో కోర్సు పూర్తి చేసిన మదన్‌ ఇటీవల బెంగళూరులో అసెసిస్‌ అనే కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తుకున్నాడు. అన్ని అర్హతలు ఉండడంతో కంపెనీ రూ.1.10 లక్షల ప్యాకేజీతో మదన్‌కు ఉద్యోగం కల్పించింది. మదన్‌ బెంగళూరు కంపెనీలో జాయినింగ్‌ రిపోర్ట్‌ అందజేసి భువనేశ్వర్‌–బెంగళూరు(హమ్‌సఫర్‌) రైలులో తిరిగి శ్రీకాకుళం వస్తుండగా దూసి రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం వేకువజామున రైలు నుంచి జారి పడి మృతి చెందాడు.

కాగా, మదన్‌ మరణంపై అనుమానాలు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మదన్‌ మృతదేహానికి శ్రీకాకుళం రిమ్స్‌లో పోస్టుమార్టం చేసి, సొంత గ్రామమైన వీరగున్నమ్మపురానికి తీసుకువచ్చారు. కుమారుని మృతదేహం చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top