విధి విషాదం | Sakshi
Sakshi News home page

విధి విషాదం

Published Wed, Jan 22 2020 9:57 AM

Man Died in Road Accident in Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. మూడు నెలల క్రితం కూతురు డెంగీ జ్వరంతో కోమాలోకి వెళ్లి మరణించింది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి సైతం కోమాలోకి వెళ్లి రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూయడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌– 10లో వాకింగ్‌ చేస్తున్న యువకుడిని మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలై కోమాలోకి వెళ్లిన బాధితుడు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు. కర్ణాటకకు చెందిన కురువ అశోక్‌ (30) కారు డ్రైవర్‌గా పని చేస్తూ భార్య మంజుతో కలిసి బోరబండ సమీపంలోని ఎస్పీఆర్‌ హిల్స్‌ బీజేఆర్‌ నగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

ప్రతిరోజూ తెల్లవారుజామునే బీజేఆర్‌నగర్‌ నుంచి వాకింగ్‌చేస్తూ జూబ్లీహిల్స్‌ వరకు వచ్చి తిరిగి వెళ్తుంటాడు. ఈ నెల 19న తెల్లవారుజామున 5.30 గంటలకు జూబ్లీహిల్స్‌లో వాకింగ్‌ చేసి ఇంటికి వెళ్తున్నాడు. అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు కావడంతో అశోక్‌ కోమాలోకి వెళ్లాడు. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశాడు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్‌ సుశీల్‌ ఈసీఐఎల్‌లో నివసిస్తాడని కన్సల్టేషన్‌ వ్యాపారం చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. సుశీల్‌పై ఐపీసీ సెక్షన్‌ 304(ఏ) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివ శంకర్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారిని అరెస్ట్‌ చేయాలంటూ మృతుడు అశోక్‌ కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.   

మూడు నెలల క్రితం కూతురు సైతం..   
అశోక్, మంజు దంపతులకు కూతురు అనన్య (3) ఉండేది. మూడు నెలల క్రితం చిన్నారికి డెంగీ జ్వరం సోకింది. మూడు రోజుల పాటు కోమాలోకి వెళ్లి నిలోఫర్‌ ఆస్పత్రిలో మృతి చెందింది. ఆ ఘటన నుంచి తేరుకోకముందే అశోక్‌ సైతం మూడు రోజుల పాటు కోమాలోకి వెళ్లి మృతి చెందడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 

Advertisement
Advertisement