బర్త్‌డే పార్టీకంటూ వెళ్లి..   | Man Died In Road Accident | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి పడి యువకుడి దుర్మరణం 

Aug 11 2018 11:06 AM | Updated on Oct 16 2018 3:15 PM

Man Died In Road Accident  - Sakshi

గుంతలో పడి ఉన్న శ్రీనివాస్‌ మృతదేహం, ఇన్‌సెట్‌లో శ్రీనివాస్‌ ఫైల్‌ ఫొటో

కొల్చారం(నర్సాపూర్‌) మెదక్‌ : స్నేహితుడి బర్త్‌డే పార్టీ ఉందని చెప్పి రాత్రి ఇంటి నుండి బైక్‌పై వెళ్లిన యువకుడు తెల్లవారు జామున గ్రామ శివారులో రోడ్డు పక్కన బురద గుంతలో శవమై కనిపిం చాడు. ఈ విషాదకర ఘటన చిన్నఘణాపూర్‌ గ్రామశివారులో చోటు చేసుకుంది. మృతుని తండ్రి వడ్ల లక్ష్మీనారాయణ, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు వడ్ల శ్రీనివాస్‌(24)తల్లి ఎనిమిదేళ్ల క్రితం మరణించింది.

అతని సోదరి వివాహం సైతం కావడంతో తండ్రితో పాటు గ్రామంలో ఉంటూ మెదక్‌ పట్టణంలోని వరుణ్‌ మోటర్స్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం మెదక్‌ వెళ్లి వచ్చిన శ్రీనివాస్‌ రాత్రి 8 గంటల సమయంలో ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీ ఉందని తండ్రికి చెప్పి బైక్‌పై వెళ్లాడు. పొలం వద్ద సాయంత్రం వరకు పనులు చేసి అలసిపోయిన అతని తండ్రి లక్ష్మీనారాయణ కొడుకు కోసం ఎదురు చూస్తూ నిద్రపోయాడు.

మధ్యలో మెలకువ రావడంతో ఫోన్‌ చేయగా వస్తున్నానని శ్రీనివాస్‌ చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. శుక్రవారం తెల్లవారు జామున గ్రామ శివారులోని గొల్లగుట్ట సమీపంలోని మెదక్‌–జోగిపేట ప్రధాన రహదారి పక్కన బురదగుంటలో శ్రీనివాస్‌ మృతదేహం పడి ఉంది. శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. గమనించిన గ్రామస్తులు తండ్రి లక్ష్మీనారాయణకు సమాచారం అందించారు. బైక్‌ అదుపుతప్పి పడటంతో తీవ్రంగా గాయపడి శ్రీనివాస్‌ మృతి చెంది ఉంటాడని ఘటన స్థలాన్ని సందర్శించిన కొల్చారం ఎస్‌ఐ పెంటయ్య తెలిపారు.

శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సర్వస్వం అనుకున్న కొడుకు శవమై కనిపించడంతో లక్ష్మీనారాయణ రోదిస్తున్న తీరు గ్రామస్తులకు కంటతడి పెట్టించింది.

గుంతలో పడి ఉన్న శ్రీనివాస్‌ మృతదేహం, ఇన్‌సెట్‌లో శ్రీనివాస్‌ ఫైల్‌ ఫొటో 

Advertisement
 
Advertisement
Advertisement