పుట్టిన రోజు వేడుకలకు వెళ్తూ..

Man Died In Bike Accident Srikakulam - Sakshi

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మూడు బైక్‌లపై ఆరుగురు యువకులు అరకు పయనం

మార్గమధ్యలో రాతిబుగ్గి కుప్పను ఢీకొని మృత్యువాత

శృంగవరపుకోట రూరల్‌ : ఎస్‌.కోట మండలంలోని కాపుసోంపురం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ముందు వేసిన రాతిబుగ్గి కుప్పను ఢీకొట్టి యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి ఎస్సై ఎస్‌.అమ్మినాయుడు తెలియజేసిన వివరాల ప్రకారం.. విశాఖలోని మర్రిపాలెం జ్యోతినగర్‌కు చెందిన పైడి వాసు, షేక్‌ బాషా, దుర్గాప్రసాద్, సురేష్, శంకర్, రాజేష్‌ స్నేహితులు. వీరిలో సంపతిరావు సురేష్‌ పుట్టిన రోజు శుక్రవారం కావడంతో వేడుకలు జరుపుకునేందుకు వేకువజామున నాలుగు గంటల సమయంలో ఆరుగురూ మూడు ద్విచక్ర వాహనాలపై అరుకు బయలుదేరారు. ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఎస్‌.కోట దాటిన అనంతరం నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఉన్న రాతికుప్పను వాసు నడుపుతున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వాసు రోడ్డుపైకి తుళ్లిపోగా... వెనుక కూర్చున్న బాషా రాతిబుగ్గి కుప్పపై పడిపోయాడు. వెనుక రెండు ద్విచక్ర వాహనాలపై వస్తున్న వారు వెంటనే స్పందించి వాసును ఎస్‌.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ వాసు (21) మృతి చెందాడు. కళ్లముందే స్నేహితుడు చనిపోవడంతో మిగిలిన స్నేహితులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. వాసు మృతితో మర్రిపాలెంలోని జ్యోతినగర్‌లో విషాదం అలుముకుంది. మద్యం మత్తులో అతివేగంగా ద్విచక్ర వాహనం నడిపినందు వల్లే ప్రమాదం జరిగినట్లు ఎస్సై అమ్మినాయుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top