కాలువలోకి దూసుకెళ్లిన కారు..  డ్రైవర్‌ మృతి

Man Died  After Car Went To Canel in West Godavari - Sakshi

సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : పశ్చిమడెల్టా ప్రధాన కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో కొవ్వూరు ఇందిరమ్మకాలనీకి చెందిన చిర్రా శివరామకృష్ణ (27) మరణించాడు.  సమిశ్రగూడెం ఇన్‌చార్జ్‌ ఎస్సై కె.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న శివరామకృష్ణ  పెరుమళ్ల సుబ్రహ్మణ్యానికి చెందిన ఏపీ05డీడీ 2499 నంబర్‌గల కారు తీసుకుని గురువారం రాత్రి ఒంటరిగా డ్రైవ్‌ చేసుకుంటూ భీమవరం బయలుదేరాడు. నిడదవోలు మండలం విజ్జేశ్వరం సమీపంలో కారు కాలువలోకి దూసుకెళ్లింది.

అతను వెంటనే కారు కాలువలోకి వెళ్లిపోయిందని, తాను మునిగిపోతున్నానని తల్లి వరలక్ష్మి, స్నేహితుడు ముళ్లపూడి సురేష్‌లకు ఫోన్‌ చేసి చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గురువారం అర్ధరాత్రి శివరామకృష్ణ బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం కొవ్వూరు సీఐలు ఎంవీవీఎస్‌ మూర్తి, ఎం.సురేష్‌ తహసీల్దార్‌ ఎల్‌.జోసెఫ్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి కాలువలో నుంచి కారును వెలికితీసేందుకు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టారు. కాలువకు నీటిని తగ్గించి అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పడవ కూలీలు కారు ఆచూకీ కోసం శుక్రవారం ఉదయం నుంచి వెదకగా 11 గంటల సమయంలో కారుని గుర్తించారు. క్రేన్‌ సహాయంతో దానిని బయటకు తీశారు.

కారులో ఉన్న శివరామకృష్ణ మృతదేహన్ని చూసి తల్లి వరలక్ష్మితో పాటు కుటుంబసభ్యులంతా గుండెలవిసేలా రోదించారు. మృతదేహన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. శివరామకృష్ణకు భార్య దుర్గాదేవితో పాటు ఒక కుమార్తె ఉంది. కారు వేగంగా నడుపుతుండటంతోపాటు సెల్‌ఫోన్‌ మాట్లాతుండటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.  తల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాద్‌ చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top