తాతల ఆస్తి అంటూ.. అర్ధరాత్రి వీరంగం

Man Demolished Temple Store Complex In Anantapur - Sakshi

తాతల ఆస్తి తనకే చెందుతుందంటూ ఓ వ్యక్తి దేవాలయ దుకాణ సముదాయాన్ని అర్ధరాత్రి తర్వాత జేసీబీలతో కూలి్చవేయించాడు. అడ్డుకోబోయిన వారిని బెదిరించడమే కాకుండా, వారించబోయిన పోలీసులనూ సెక్షన్ల పేరుతో బెదరగొట్టి.. తన చర్యను సమర్థించుకుంటూ ఫేస్‌బుక్‌ లేవ్‌ పెట్టి వీరంగం సృష్టించాడు. 

సాక్షి,ధర్మవరం: పట్టణ నడిబొడ్డున గల పాండురంగస్వామి దేవాలయ భూమిని తన తాతలు దానంగా ఇచ్చారని, అందులో భవన సముదాయానికి సంబంధించిన బాడుగలు తనకే చెల్లించాలని మేడా లోకేష్‌ అనే వ్యక్తి కొంతకాలంగా దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో గొడవపడుతూ వస్తున్నాడు. అయితే ఆ భూమికి, మేడా లోకేష్‌కు ఎటువంటి సంబంధం లేదని, అన్ని కోర్టులూ ఆ స్థలం పాండరంగ స్వామి దేవాలయానికే చెందుతుందని తీర్పులు ఇచ్చాయి. లోకేష్‌ మాత్రం తనకు పై కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని కొంతకాలంగా ఎండోమెంట్‌ అధికారులతో అడ్డగోలుగా వాదనకు దిగుతూ, దుకాణదారులను ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడం, భవన సముదాయం ఆస్తి తనకే చెందుతుందంటూ ఫ్లెక్సీలు కట్టడం చేస్తున్నాడు. దీనిపై గతంలోనే అతడిపై కేసులు నమోదయ్యాయి. కాగా రెండు మూడు రోజులుగా పాండురంగస్వామి గుడి స్థలం తమదేనని, తాను ఫిబ్రవరి 29 మధ్యాహ్నం 3.30 గంటలకు స్వాధీనం చేసుకుంటానని, ఎవరైనా అడ్డుకుంటే లాలోని సెక్షన్లతో కోర్టుకు లాగుతానని బెదిరిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు పెట్టాడు.

దీంతో ఎండోమెంట్‌ అధికారులు సదరు మేడా లోకేష్‌  దుష్ప్రచారం చేస్తున్నాడని, ఆ భూమి దేవదాయ శాఖకే చెందుతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు పత్రికల్లో బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మేడా లోకేష్‌  ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో 15 మందితో కలిసి జేసీబీ తీసుకువచ్చి ఆ భవన సముదాయాన్ని కూలి్చవేయించాడు. ఏకంగా తన ఫేస్‌బుక్‌లో లైవ్‌పెట్టి తాను చేసిన ఘనకార్యాన్ని ప్రసారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అర్థరాత్రి ఏం పనయ్యా ఇది అని అడిగితే ‘తనకు కోర్టు తీర్పు ఇచ్చింది.. ఈ ఆస్తి నాది.. ఏమైనా  చేసుకుంటా’నంటూ ఎదురుదాడికి దిగాడు. స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకోబోతే వారిని సైతం సెక్షన్లపేరుతో బెదిరింపులకు గురిచేశాడు. చివరకు పోలీసులు జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ధ్వంసరచనను ఆపివేయించారు. దాదాపు ఆరు దుకాణాలు ధ్వంసం కాగా, అందులో బాడుగకు ఉంటున్న వారికి రూ.25 లక్షల నష్టం వాటిల్లింది.  

దేవదాయ శాఖ అధికారులేమంటున్నారంటే..
విషయం తెలుసుకున్న దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషర్‌ ఎం.రామాంజనేయులు, కార్యనిర్వాహక అధికారి బాబు, ఈఓలు సుబ్రమణ్యం, నాగేంద్రుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ దేవాలయానికి శేషగిరిరావు అనే వ్యక్తి 1947లో భూమిని దానం చేశారని తెలిపారు. ఆ భూమిలో మేడా లోకేష్‌ తాత గుర్రప్ప భక్తులు ఇచ్చిన చందాలతో సత్రం కట్టించాడన్నారు. అయితే ఆ సత్రం తనకే చెందుతుందని 1987లో లోకేష్‌ కోర్టులో కేసు వేయడంతో 1993లోనే ధర్మవరం కోర్టు దాన్ని కొట్టేసిందన్నారు. ఆ తరువాత మేడా లోకేష్‌ తల్లి క్రిష్ణవేణమ్మ 2011లో పెనుకొండ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో కేసు వేస్తే 2013లో ఆ కోర్టు కూడా కొట్టివేసిందన్నారు. తిరిగి 2016లో హిందూపురం కోర్టులో కేసు వేస్తే అక్కడ కూడా దేవదాయశాఖకే అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయితే మేడా క్రిష్ణవేణమ్మ కుమారుడైన మేడా లోకేష్‌ సదరు ఆస్తి తనకే చెందుతుందని, మార్చి ఒకటో తేదిలోపు స్వా«దీనం చేయాలని, దుకాణంలో బాడుగకు ఉంటున్న వారందరూ ఖాళీ చేయాలని పోస్టర్లు అతికించాడన్నారు. తాము ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని, రాత్రికి రాత్రే ఇంత దారుణానికి పాల్పడటం దారుణమన్నారు. 

నిందితులు అరెస్ట్‌ 
పాండురంగస్వామి దేవాలయ ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన మేడా లోకే‹Ùతోపాటు మరో ఇద్దరు నిందితులను ధర్మవరం పట్టణ పోలీసులు ఆరెస్ట్‌ చేశారు. అనంతరం పట్టణ సీఐ కరుణాకర్, ఎస్‌ఐ హర్ష విలేకర్లతో మాట్లాడుతూ సదరు మేడా లోకే‹Ùకు ఏ కోర్టులోనూ తీర్పు అనుకూలంగా రాలేదన్నారు. దీంతో అతను సంయమనం కోల్పోయి ఇంత దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు. పాండురంగ స్వామి దేవాలయ ఈఓ సుబ్రమణ్యం ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top