న్యూడ్‌ ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరింపులు

Man arrested for blackmailing woman with nude photos in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దొంగతనంగా ఓ యువతి నగ్న చిత్రాలను సేకరించిన డబ్బులివ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ ఓ యువకుడు ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. వివరాలివీ.. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ప్రైవేట్‌ ఫొటోలు ఆమె స్నేహితురాలి ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. వాటిని గుంటూరుకు చెందిన షేక్‌ ఆజాద్‌ దొంగచాటుగా తన సెల్‌లోకి పంపుకున్నాడు. అనంతరం ఆ ఫొటోలను నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తానంటూ వాట్సాప్‌లో బెదిరింపులు ప్రారంభించాడు. ముందుగా కొన్ని ఫొటోలను కూడా ఆమెకు పంపాడు. ఈ నెల 6వ తేదీన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి రూ.4లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేకుంటే అన్నంత పనీ చేస్తానని హెచ్చరికలు చేశాడు. దీంతో బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. అప్రమత్తమైన పోలీసులు సోమవారం సికింద్రాబాద్‌ వచ్చిన ఆజాద్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని, అతని వద్ద ఉన్న నగ్నచిత్రాల సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. మంగళవారం నిందితుడిని రిమాండ్‌కు పంపారు.

వివాహితకు వేధింపులు, వ్యక్తికి 4 రోజుల జైలు శిక్ష

వివాహిత వెంట పడి వేధిస్తున్న వ్యక్తికి న్యాయస్థానం నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ జగదీష్‌ సమాచారం మేరకు.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-5లోని దుర్గాభవానీ నగర్‌లో నివసించే ఇ.కృష్ణ(36) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇదే బస్తీలో నివసిస్తున్న వివాహితతో కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక సారి ఆమెను తీసుకొని వెళ్లిపోగా బస్తీవాసులు తమదైన రీతిలో గుణపాటం చెప్పారు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా మూడు రోజుల క్రితం ఆమె వెళ్లే సమయంలో వెంబడిస్తూ వేధింపులకు గురి చేయడంతో బాధితురాలి భర్త రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్‌ 70(సి) కింద పోలీసులు కేసు నమోదు చేసి పదవ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి అల్తాఫ్‌ హుస్సేన్‌ మంగళవారం నిందితుడికి నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 50 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

అశ్లీల వెబ్‌సైట్ల కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌

టాలీవుడ్‌ హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్‌ చేస్తూ రేటింగ్‌తో సొమ్ము చేసుకుంటున్న పలు అశ్లీల వెబ్‌సైట్ల నిర్వాహకులిద్దరిని సీఐడీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసినట్టు అదనపు డీజీపీ గోవింద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అహ్మదాబాద్‌ మహాసేన జిల్లాకు చెందిన తాకూర్‌ మహేష్‌కుమార్‌ జయంతి, తాకూర్‌ బాల్‌సిన్హ్‌ను అరెస్ట్‌ చేసి అక్కడి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. ట్రాన్సిస్ట్‌ వారెంట్‌పై ఇద్దరిని హైదరాబాద్‌ తీసుకువచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు, ఆర్టిస్టుల ఫోటోలతో మార్ఫింగ్‌ చేసి ఐదు అశ్లీల సైట్లలో అప్‌లోడ్‌ చేశారని, ఈ సైట్ల హిట్స్‌తో నెలకు రూ.35వేలు సంపాదిస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. వీరి నుంచి నాలుగు ల్యాప్‌ట్యాపులు, రెండు సెల్‌ఫోన్లు, మూడు సిమ్‌కార్డులు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు గోవింద్‌ వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top