రక్తంతో గర్ల్‌ఫ్రెండ్‌కు బొట్టుపెట్టి..

Man Applies Blood As Sindoor On Girlfriends Head Before Killing Her - Sakshi

ముంబై : బాలీవుడ్‌ మూవీల తరహాలో తన చేతిని కోసుకుని గర్ల్‌ఫ్రెండ్‌ నుదుటిన బొట్టు పెట్టి అనంతరం ఆమెను చంపి తాను ఉరివేసుకున్న యువకుడి ఉదంతం ముంబై నగరంలోని కళ్యాణ్‌లో చోటుచేసుకుంది. యూపీకి చెందిన 21 ఏళ్ల అరుణ్‌ గుప్తా వారణాసికి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి గర్ల్‌ఫ్రెండ్‌ను హతమార్చేందుకే కళ్యాణ్‌కు చేరుకుని ఆమెను చంపి తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కళ్యాణ్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో గర్ల్‌ఫ్రెండ్‌ ప్రతిభా ప్రసాద్‌ను కలిసిన గుప్తా ఆమెను గొంతుపిసికి చంపేముందు తన చేతిని కోసుకుని ఆమె నుదుటిన సింధూరంలా అద్దాడని, ఆమెతో సెల్ఫీ తీసుకుని తర్వాత అదే గదిలోని సీలింగ్‌కు ఉరివేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న జంట బయటకు వెళ్లలేదని, సాయంత్రం ఒకసారి కేవలం మంచినీళ్లు అడిగారని సిబ్బంది చెప్పుకొచ్చారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో డిన్నర్‌కు పిలిచేందుకు తలుపు తట్టగా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా ప్రతిభా బెడ్‌పై విగతజీవిగా పడిఉండగా, అరుణ్‌ సీలింగ్‌ నుంచి వేలాడుతూ కనిపించాడు. తన చేయి కోసుకునేందుకు వాడిన బ్లేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా యువకుడు తనతో కలిసి జీవించేందుకు తమ పట్టణానికి రావాలని కోరగా నిరాకరించిన ప్రతిభాను హతమార్చి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడాది కిందట ఫేస్‌బుక్‌లో వీరికి పరిచయం ఏర్పడింది. గుప్తా యూపీలోని అజంగఢ్‌ నివాసి కాగా, యూపీకి చెందిన ప్రతిభ ముంబైలోని ఘట్కోపర్‌లో నివసిస్తోందని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top