Lovers Committed To Suicide in Rangareddy District - Sakshi
Sakshi News home page

ప్రేమికుల ఆత్మహత్య.. బోయిన్‌గుట్టలో ఉద్రిక్తత

Oct 17 2018 11:53 AM | Updated on Oct 17 2018 12:57 PM

Lovers Suicide Commitment In Rangareddy - Sakshi

కడ్తాల్‌(కల్వకుర్తి): వారి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నారు. 14 సంవత్సరాల బాలిక.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న 23 సంవత్సరాల అబ్బాయితో ప్రేమలో పడింది. ఇద్దరి వయసులో తేడాతో పాటు వరుసలు కూడా కుదరకపోవడంతో పెద్దలు వీరి ప్రేమను నిరాకరించారు. దీంతో బాలిక, యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. షాద్‌నగర్‌ ఎసీపీ సురేందర్, కడ్తాల్‌ ఎస్‌ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్‌ మండలం చరికొండ పంచాయతీ పరిధిలోని బోయిన్‌గుట్టతండాకు చెందిన నేనావత్‌ రఘు–మంగమ్మ దంపతుల రెండో కూతురు నేనావత్‌ రేణుక(14), అదే తండాకు చెందిన పాత్లవత్‌ హూమ్లా, కేడీ దంపతుల మూడో కుమారుడు పాత్లావత్‌ రాజునాయక్‌(23) ప్రేమించుకున్నారు.

వివాహం చేసుకుని  జీవితాంతం కలిసి ఉండాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు కడ్తాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీంతో  మిస్సింగ్, కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక, ఆ యువడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. బాలికకు స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చి.. యువకుడిపై కేసు నమోదు చేసి  రిమాండ్‌కు పంపిచారు. ఇదిలా ఉండగా.. రెండు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన పాత్లావత్‌ రాజు గతంలో మాదిరిగానే  ఆటో నడుపుతూ బతుకువెళ్లదీస్తుండగా వారం రోజుల క్రితం రేణుకతో రాజు మాట్లాడాడని అదే తండాకు చెందిన కొందరు రేణుక తల్లితో చెప్పారు.

దీంతో రేణుకను ఆమె తల్లి ఈ నెల 11న  మందలించింది. మనస్తాపం చెందిన రేణుక 12వ తేదీ ఉదయం పురుగుల మందు తాగగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. సోమవారం మృతదేహన్ని బోయిన్‌గుట్టకు తండాకు తీసుకువచ్చారు. అయితే, రాజు కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని అతడి ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. యువకుడి ఇంటి వద్ద  ఇరువర్గాలకు చెందిన వారు  ఘర్షణకు దిగడంతో సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకుని ఇరువర్గాల వారిని శాంతిపజేశారు. రేణుక కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు.

మనస్తాపంతో ప్రేమికుడి ఆత్మహత్య.. 
ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన పాత్లావత్‌ రాజు మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా అప్పటికే తండాకు చేరుకున్న మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు తమ కుమారిడిది ఆత్మహత్య కాదని, హత్య చేసి నోట్లో పురుగుల మందు పోశారని ఆరోపించారు. దీంతో తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలతో తండాలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం యువకుడి అంత్యక్రియలు నిర్వహించారు. ఇరువురి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement