గుళ్లో ప్రేమ పెళ్లి.. తరిమికొట్టిన తల్లిదండ్రులు | Love Marrage With Fake Profile In Karnataka | Sakshi
Sakshi News home page

‘ఫేక్‌’ పెళ్లితో బుక్‌

Published Tue, Oct 23 2018 11:32 AM | Last Updated on Tue, Oct 23 2018 11:32 AM

Love Marrage With Fake Profile In Karnataka - Sakshi

కర్ణాటక, బనశంకరి: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో ఫేక్‌ (నకిలీ) సమాచారం నింపుతూ మోసగాళ్లు వంచనలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుని మాయలో పడి ఉత్తరప్రదేశ్‌ నుంచి నగరానికి వచ్చిన యువతి పెళ్లి చేసుకుని నిలువునా మోసపోయింది. ఒక్క నెలకే ఈ ప్రేమ పెళ్లి వీధినపడింది. యువతి వయసు 23 ఏళ్లు కాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. నగర యువకునికి 20 ఏళ్లు కాగా, ఎలాంటి ఉద్యోగం లేదు. ఆరునెలల క్రితం ఇద్దరికీ ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఫోన్‌ నంబర్లు తీసుకుని మాట్లాడేవారు. యువకుడు తన వయసు, వృత్తితో పాటు అన్ని విషయాలను దాచిపెట్టాడు. బెంగళూరుకు వస్తే పెళ్లి చేసుకుంటానని, నిన్ను రాణీలా చూసుకుంటానని యువతినినమ్మించాడు. యువతి ఢిల్లీ మీదుగా రైలు ఎక్కి బెంగళూరులో వాలిపోయింది. ఇద్దరూ కలిసి ఓ గుడిలో పూలదండలు మార్చుకుని పెళ్లి తంతు ముగించారు. 

కూతురిపై తల్లిదండ్రుల దాడితో రట్టు  
ఇంట్లో పెళ్లి సంగతి తెలిస్తే ఒప్పుకోరని చెప్పి యువతిని ఒక హాస్టల్లో నెలరోజుల పాటు ఉంచాడు. యువకుడు ఇటీవలే భార్యను తీసుకెని ఇంటికెళ్లగా వారు భగ్గుమని ఇద్దరినీ ఇంటి నుంచి బయటికి గెంటేశారు. అంతేగాక ఉత్తరప్రదేశ్‌ నుంచి యువతి తల్లిదండ్రులను నగరానికి రప్పించి మీ కుమార్తెను తీసుకెళ్లానని సూచించారు. నగరానికి వచ్చిన యువతి తల్లిదండ్రులు ఆమెను సొంతూరికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ భర్తతోనే ఉంటానని పట్టుబట్టిన కుమార్తెను ఆమె తల్లిదండ్రులు రైల్వేస్టేషన్‌లోనే కొట్టడం చూసిన రైల్వేపోలీసులు వనితా సహాయవాణి కి సమాచారం అందించారు. వనితా సహాయవాణి సిబ్బంది యువతిని రక్షించి కార్యాలయానికి తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ నిర్వహించగా మోసపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. సహాయవాణి సిబ్బంది యువకుడిని కార్యాలయానికి పిలిపించి విచారించగా తనకు ఇంకా 20 ఏళ్లు అని, ఉద్యోగం వచ్చాక సంసారం కొనసాగిస్తానని చెప్పాడు. తాను బెంగళూరులోనే ఉండి ఏదైనా ఉద్యోగం చేస్తానని యువతి పట్టుబట్టడంతో ఆశ్రయ కేంద్రంలోనే ఉంచామని సహాయవాణి కౌన్సిలర్‌ సంధ్యారాణి తెలిపారు. 

విదేశీ యువతికి వల వేసిన మెకానిక్‌ బాలుడు
బెంగళూరులో బైక్‌ మెకానిక్‌ ఒకరువిదేశీ యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని మోసగించే యత్నం చేశాడు. వనితా సహాయవాణి సంచాలకురాలు రాణిశెట్టి ఈ వివరాలు వెల్లడించారు. ఓ 17 ఏళ్ల అబ్బాయి గ్యారెజ్‌కు వచ్చే బైకులను ఫోటోలుతతీసి  ఫేస్‌బుక్‌లో పెట్టేవాడు. ఆ ఫోటోలు చూసి ఓ విదేశీ యువతి అతనితో పరిచయం పెంచుకుంది. తానో పెద్ద మెకానిక్‌నని, సొంత గ్యారేజ్‌ ఉందని, భారత్‌కు వస్తే పెళ్లి చేసుకుందామని అతను నమ్మించాడు. ఆమెకు అనుమానం వచ్చి ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయగా సహాయవాణికి కేసు అప్పగించారు. వారు అబ్బాయిని పిలిపించి ఆరా తీస్తే తానో చిన్న మెకానిక్‌నని నిజం చెప్పాడు. ఫేస్‌బుక్‌లో కనిపించేదంతా నిజం కాదని, మహిళలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని రాణిశెట్టి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement