ప్రేమ జంట ఆత్మహత్య

Love Couple Commits Suicide in Tenali Guntur - Sakshi

హోటల్‌ గదిలో ఉరేసుకున్న ప్రేమికులు

తెనాలిలో ఘటన

ప్రియుడు వివాహితుడు

సాక్షి, తెనాలి రూరల్‌: గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ హోటల్‌లో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు రోజులుగా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది కిటికీ నుంచి చూడగా, గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఉన్నారు. ప్రియుడు విజయవాడకు చెందిన వివాహితుడు కాగా, యువతి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. దీనికి సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏలూరుకు చెందిన కొత్తలంక సాయిదివ్య (24) బీటెక్‌ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. బ్యాంకు పరీక్షలకు సంబంధించి విజయవాడలో కోచింగ్‌ తీసుకునేందుకు ప్రతిరోజు వచ్చి వెళుతుండేది. ఈ క్రమంలో విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ దారా పృధ్వీరాజు (30)తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. సాయిదివ్య కనబడడం లేదంటూ ఈ నెల 9న ఆమె కుటుంబసభ్యులు ఏలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా...
తెనాలి పట్టణం గాంధీచౌక్‌ సమీపంలోని ఓ హోటల్‌లో ఈ నెల 12న అద్దెకు దిగిన పృధ్వీరాజ్, సాయిదివ్య అప్పటి నుంచి బయటకు రాలేదు. సాయిదివ్య కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులు, ఏలూరు పోలీసులు, ఆమె సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా తెనాలిలో ఉన్నట్టు గుర్తించారు. వాకబు చేసుకుంటూ రాత్రికి గాంధీచౌక్‌ సమీపంలోని హోటల్‌కు వచ్చారు. హోటల్‌ సిబ్బంది, సాయిదివ్య కుటుంబసభ్యులు వెళ్లి తలుపు కొట్టగా సమాధానం లేదు. కిటికీలో నుంచి చూడగా, ఇద్దరూ ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నారు. దీంతో వెంటనే తెనాలి పోలీసులకు సమాచారమిచ్చారు.

ఈ నెల 12వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో పృధ్వీరాజ్, సాయిదివ్య హోటల్‌లో గది తీసుకున్నట్టు రికార్డులను పరిశీలించిన పోలీసులు నిర్ధారించారు. గది తలుపులు పగులగొట్టి, శవ పంచనామా చేసేందుకు వీలు పడకపోవడంతో మృతదేహాలను తరలించలేదు. వన్‌టౌన్‌ సీఐ ఎం.శ్రీనివాసరావు, సిబ్బంది హోటల్‌కు చేరుకున్నారు. రెండు రోజులుగా ఇద్దరూ బయటకు రాకపోయినా, లాడ్జి సిబ్బంది గమనించకపోవడంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. రెవెన్యూ అధికారులు వచ్చిన అనంతరం శవ పంచనామా నిర్వహించి, పోస్ట్‌మార్టం కోసం తరలిస్తామని పోలీసులు తెలిపారు. పృధ్వీరాజ్‌కు వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top