‘శ్రీరాం చిట్స్‌’కు తాళం

Lock To  Sri ram Chits - Sakshi

జనగామ: రుణం చెల్లించిన తర్వాత ఇంటి పత్రాలు ఇవ్వడం లేదని ఆగ్రహిస్తూ బాధిత కుటుంబం శ్రీరాం చిట్‌ఫండ్‌ కార్యాలయానికి తాళం వేసి, ఆందోళన చేసిన సంఘటన సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. తమ కుటుంబానికి జరిగిన నష్టానికి అందులో పనిచేస్తున్న ముగ్గరు బాధ్యత వహించాలని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. దీంతో చిట్‌ఫండ్‌ ప్రతినిధులతో బాధితుల తరఫున వచ్చినవారు కొద్దిసేపు వాగ్వాదం చేశారు.

ఈ సందర్భంగా బాధితుడు పుల్లోజు కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడారు. తన వ్యాపారాభివృద్ధి కోసం శ్రీ రాం చిట్‌ఫండ్‌లో ఇంటి డాక్యుమెంట్లు పెట్టి రూ.10 లక్షల అప్పు తీసుకున్నానని తెలిపాడు. రూ.7,25,875 చెల్లించిన తర్వాత ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదని చెప్పాడు. పూర్తిస్థాయిలో కట్టలేక పోయానన్నారు. ఫైనాన్స్‌ కంపెనీ ఒత్తిడితో రూ.11 లక్షలకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేసుకుని, ప్రైవేట్‌లో అప్పు తీసుకువచ్చి చెల్లించామన్నారు.

అప్పు చెల్లించిన తర్వాత కూడా తన ఇంటి డాక్యుమెంట్లు ఇవ్వడం లేదన్నారు. అప్పు చెల్లించేటప్పుడు మూడు రోజుల్లో పత్రాలు ఇస్తామని చెప్పి, ఏడు నెలలు గడిచినా పట్టించుకోవడం లేదని వివరించాడు. మరో వ్యక్తికి జమానతు ఉన్నానని చెబుతూ బెదిరింపులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఐటీ షూరిటీ మాత్రమే ఉన్నానని, అతడు రుణం తీసుకుని ఆరు ఏళ్లు గడిచినా ఒక్కసారి కూడా తనకు నోటీసులు పంపించలేదని తెలిపాడు.

ఇంటి డాక్యుమెంట్లు ఇవ్వకపోతే మా కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని, మమ్మల్ని మోసం చేసిన సిబ్బంది విద్యాసాగర్, శ్రీనివాస్, సంపత్‌ జరిగిన నష్టానికి బాధ్యత వహించాలని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ విషయమై చిట్‌ ఫండ్‌ మేనేజర్‌ సంతోష్‌ విలేకరులతో మాట్లాడుతూ పుల్లోజు కృష్ణమూర్తి తమ వద్ద తీసుకున్న రుణం తీర్చాడని, మరో వ్యక్తికి జమానతు ఉండడంతోనే డాక్యుమెంట్లు ఇవ్వలేదన్నాడు. తనకు నోటీసులు కూడా పంపించామని తెలిపాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top