దా‘రుణం’

Loan Cheating Case File in Hyderabad - Sakshi

రూ. 10 లక్షల రుణం కోసం రూ.11లక్షలు వసూలు  

సైబర్‌ నేరగాళ్ల టోకరా ముగ్గురు సభ్యుల ముఠా అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: తక్కువ వడ్డీకే రుణమిస్తామంటూ మూడేళ్ల క్రితం వచ్చిన ఫోన్‌కాల్‌ను నమ్మిన కొండాపూర్‌ వాసి నుంచి రూ.10 లక్షల రుణం కోసం పలు దఫాలుగా రూ.11,20,000 డిపాజిట్‌ చేయించుకుని మోసం చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను  సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి సీపీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పవన్‌ కుమార్, రాహుల్‌ పంచల్, ముఖేష్‌ చక్రవర్తి 2015లో నోయిడాలో బురా మాల్‌ అగర్వాల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ కంపెనీలో టెలికాలర్‌గా  పనిచేశారు.

అయితే ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ నిబంధనలు పాటించకపోవడంతో సదరు కంపెనీని 2016లో మూసివేశారు. అయితే ఈ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో నేర్చుకున్న మెళకువలతో పవన్‌కుమార్‌ పాత కస్టమర్ల పాలసీల జాబితాను ఆధారంగా చేసుకొని తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని నమ్మించి అమాయకులను మోసం చేయాలని పథకం పన్నాడు. ఇందుకుగాను రాహుల్, ముఖేష్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. వీరు ముగ్గురు కలిసి దేశవ్యాప్తంగా పలువురికి ఫోన్లు చేసి తక్కువ వడ్డీకే రుణమిస్తామంటూ ఎరవేశారు. ఇదే తరహాలో కొండాపూర్‌కు చెందిన గోవింద్‌ భట్‌కు 2016లో ఫోన్‌ చేసిన వీరు రూ.12,999  ప్రాసెసింగ్‌ ఫీజుగా చెల్లిస్తే అతి తక్కువ వడ్డీకి రూ.ఐదు లక్షల రుణం ఇస్తామని నిమ్మించారు. అయితే అతను పట్టించుకోకపోవడంతో కొన్నిరోజుల తర్వాత మరో సారి ఫోన్‌ చేసిన పవన్‌ మీ రుణం రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు పెరిగిందని, తక్కువ వడ్డీకే వస్తుందంటూ నమ్మబలికాడు. ప్రాసెసింగ్‌ ఫీజు రూ.24,999 చెల్లిస్తే చాలని చెప్పి పలు దఫాలుగా మూడేళ్ల నుంచి రూ.11,20,000 వరకు వివిధ బ్యాంక్‌ ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకున్నారు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన  గోవింద్‌ భట్‌ జూలై 26న సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం నిందితులను ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసి పీటీ వారెంట్‌పై మంగళవారం సిటీకి తీసుకొచ్చింది. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top