ఏమార్చి.. రూటు మార్చి..

Liquor mafia in Vijayawada - Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో లిక్కర్‌ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ దుకాణం నుంచే లిక్కర్‌ తరలించుకుపోతోంది. ఆదివారం విజయవాడ నగరంలో  ప్రభుత్వ మద్యం షాపు నుంచి ఓ ప్రైవేటు బార్‌ యాజమాన్యం సరుకును తరలించింది. పట్టపగలే ఈ తంతు జరిగినా ఆ ప్రభుత్వ మద్యం షాపుకు కూతవేటు దూరంలో ఉన్న ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఇటువంటి ఘటనలు జరుగుతున్నా.. ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో బెజవాడలో లిక్కర్‌ మాఫియా చెలరేగిపోతోందన్న విమర్శలున్నాయి. 

ఇదీ పరిస్థితి..  
జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం ఎక్సైజ్‌ యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లావ్యాప్తంగా గతంలో ఉన్న 344 షాపులను కుదించి వాటి స్థానంలో 275 మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అందులో విజయవాడ పరిధిలో 135 ప్రభుత్వ షాపులు.. మచిలీపట్నం పరిధిలో 140 ప్రభుత్వ మద్యం షాపులు ఉన్నాయి. ఇవే కాకుండా మరో 148 బార్‌ అండ్‌ రెస్టారెంట్లను ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వమే ఏపీఎస్‌బీసీఎల్‌ గోదాముల నుంచి మద్యం విక్రయిస్తోంది. అయితే ప్రభుత్వ మద్యం షాపులకు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు విక్రయించే మద్యం ధరల్లో వ్యత్యాసం చాలా ఉంది. దీంతో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమానులు కొందరు ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే వారితో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి.  

అక్రమంగా తరలింపు..  
విజయవాడ నగరం టిక్కిల్‌ రోడ్డులో గత నెల 21న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని(06449) ఎక్సైజ్‌ అధికారులు ప్రారంభించారు. గతంలో ఇక్కడ హాంగోవర్‌ పేరిట సూపర్‌ మార్కెట్‌ తరహాలో ఓ ప్రైవేటు మద్యం దుకాణం ఉండేది. ఆ షాపు నిర్వాహకులకు నగరంలో పలు బార్లు కూడా ఉన్నాయి. గతంలో హాంగోవర్‌లో పనిచేస్తున్న సిబ్బందినే ప్రస్తుత ప్రభుత్వ మద్యం దుకాణంలో నియమించారు. వీరందరూ కుమ్మక్కై ఆదివారం మధ్యాహ్నం 1.40 గంట సమయంలో 06449 నంబరు మద్యం షాపునకు సంబంధించిన బీరు, మద్యం బాటిళ్ల బాక్స్‌లను ఆటోలో లోడు చేస్తున్న దృశ్యం ‘సాక్షి’ కంట పడింది. అనుమానంతో సాక్షి ప్రతినిధి ఆ ఆటోను అనుసరించగా ఆ ఆటో నేరుగా పంట కాలువ రోడ్డులోని ‘చిల్లీస్‌ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌’ వద్ద ఆగింది. అనంతరం ఆటోలో ఉన్న మద్యాన్ని దించి బార్‌లోకి తరలించారు. మద్యం షాపు వద్ద లోడు నింపిన దగ్గర నుంచి బార్‌ వద్ద లోడును దించిన దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. ఈ తరలింపు తంతు కేవలం అరగంటలోపు పూర్తి చేశారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ప్రభుత్వ మద్యం షాపు నుంచి సరుకును ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు తరలిస్తున్నా ఎక్సైజ్‌ అధికారులు గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

కఠిన చర్యలు ఉంటాయ్‌..  
ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉన్న సరుకును ఎవరైనా బెల్టు షాపులకు కానీ, బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు కానీ విక్రయించరాదు. అలా చేస్తే దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. అలాగే కొనుగోలు చేసిన బార్‌ యజమానులపై కఠినంగా వ్యవహరిస్తాం. బార్‌ను సీజ్‌ చేస్తాం. రూ.లక్ష వరకు జరిమానా విధిస్తాం.  – మురళీధర్, ఎక్సైజ్‌ డీసీ, కృష్ణా జిల్లా

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top