తల్లీకొడుకు కలిసి చంపేశారు | Land Issues Murder Case In Khammam | Sakshi
Sakshi News home page

భూమి కోసం తండ్రినే నరికేశారు

Oct 21 2018 6:53 AM | Updated on Oct 21 2018 1:45 PM

Land Issues Murder Case In Khammam - Sakshi

సీతారాములు మృతదేహం

తిరుమలాయపాలెం: ఏడు కుంటల భూమి కోసం కట్టుకున్న భర్తను కుమారుడితో గొడ్డలితో నరికి చంపేసింది. మండలంలోని బీరోలు గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... బీరోలుకు చెందిన బుడిగె సీతారాములు(65)కు భార్య సోమలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పాతికేళ్ల క్రితం అనారోగ్యంతో సోమలక్ష్మి మృతిచెందింది. అప్పుడే సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ వివాహితులు.

సత్యవతి, కొన్నేళ్ల క్రితం తన భర్తను వదిలేసి ఖమ్మంలో ఉంటోంది. రెండేళ్ల నుంచి కుమారుడు శ్రీధర్, కోడలితో కలిసి భర్త సీతారాములు ఇంట్లోనే ఓ గదిలో ఉంటోంది. సీతారాములుకు 15 కుంటల భూమి ఉంది. అందులో వాటా కోసం గొడవలు జరిగాయి. ఏడు కుంటల భూమిని సత్యవతి పేరిట స్టాంప్‌ పేపర్‌పై  సీతారాములు రాసిచ్చాడు. భూమి పట్టా మాత్రం సీతారాములు పేరిటనే ఉంది. తన పేరున పట్టా చేయించాలని ఆమె పట్టుబట్టింది. దీనికి అతడు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి అతడి ఆలనాపాలనను వారు పట్టించుకోవడం లేదు.

దీంతో, అతడు గ్రామంలోనే భిక్షాటన చేసుకుంటున్నాడు. పగ పెంచుకున్న సత్యవతి, తన కుమారుడు శ్రీధర్‌తో కలిసి శుక్రవారం అర్థరాత్రి సీతారాములును గొడ్డలితో నరికి చంపింది. శనివారం తెల్లవారుజామున ఇది వెలుగు చూసింది. మృతదేహాన్ని ఎస్‌ఐ సర్వయ్య, ఖమ్మం రూరల్‌ ఏసీపీ రామోజి రమేష్, కూసుమంచి సీఐ ఓం మురళి పరిశీలించారు. నిందితులైన సత్యవతిని, శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. కేసును కూసుమంచి సీఐ ఓం మురళి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement