జర్నీ సినిమాలానే.. గుండె ఆగినంత పనైంది..

Kurnool road accident: several Bus passengers suffered deep shock  - Sakshi

బస్సులో భయం.. భయం

సాక్షి, కర్నూలు: వెల్దుర్తి వద్ద రోడ్డు ప్రమాదంతో వోల్వో బస్సులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి మంగళూరుకు వెళ్లే ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ వోల్వో బస్సులో సుమారు 48 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరిన బస్సు కర్నూలుకు 5.30 గంటలకు చేరుకుంది. బళ్లారి చౌరస్తా వద్ద మరో ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు వైపు సాగింది. సుమారు 6.20 గంటల సమయంలో వెల్దుర్తి చెక్‌పోస్టు వద్దకు రాగా.. భారీ కుదుపునకు గురైంది. అంతవరకు సాఫీగా సాగిన బస్సు ప్రమాదానికి గురి కావడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టిన అనంతరం తుఫాన్‌ వాహనాన్ని 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అదే సమయంలో బస్సు డీజిల్‌ ట్యాంకు లీకవడం, ఇంజిన్‌లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళనలతో కేకలు వేశారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి  ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కిందకు దూకారు. కొంతసేపటికి తేరుకుని ఎవరి దారిన వారు గమ్యస్థానాలకు బయలుదేరారు.

చదవండి: (ఘోర ప్రమాదం.. 16 మంది దుర్మరణం)

జర్నీ సినిమాలానే..
జర్నీ సినిమాను నిజంగానే చూసినట్టుంది. ఏమైందో తెలియదు. చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దం వచ్చింది. అంతలోనే ఇంజిన్‌ నుంచి పొగలొచ్చాయి. అరుపులు, కేకలతో ఆందోళనకు గురయ్యా. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అత్యవసర ద్వారం నుంచి కిందకు దూకేశా. – రామలక్ష్మీ  ఉపాధ్యాయిని, కస్తూరిబా పాఠశాల, కొత్తపల్లి 

గుండె ఆగినంత పనైంది  
బస్సు ప్రమాదానికి గురికావడం.. నెత్తురోడిన గాయాలతో జనాలు అరుస్తుండటం చూసి గుండె ఆగినంత పనైంది. బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఓ వైపు  డీజిల్‌ ట్యాంక్‌ లీకవడంతో మంటలు అంటుకున్నాయేమోనని భయపడిపోయా. – దిలీప్, బీటెక్‌ విద్యార్థి, కర్నూలు 

ప్రాణాలు పోయాయనుకున్నాం
బస్సు అదుపు తప్పి దూసుకెళ్లడంతో భయపడిపోయాం. బస్సులో మంటలు వ్యాపించాయని తోటి ప్రయాణికుడు చెప్పడంతో పిల్లాపాపలను ఎలా కాపాడుకోవాలనే ఆందోళనతో బస్సు నుంచి ఒక్కొక్కరినీ దింపేసి నేను కూడా దిగిపోయా.– రూబిత్, కలికిరి, కేరళ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top