రైల్వే ఉద్యోగం పేరుతో కోడెల కుమారుడి మోసం

Kodela Son Sivaram Booked for Rs 15 lakh Job Fraud - Sakshi

క్రీడా కోటాలో రైల్వే ఏఎల్‌పీ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు వసూలు 

నకిలీ నియామక పత్రాలు ఇచ్చి మోసగించిన వైనం

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆంధ్రా రంజీ క్రికెట్‌ క్రీడాకారుడు నాగరాజు

సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్‌ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక క్రీడాకారుడి వద్ద శివరామ్‌ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేసిన వైనం తాజాగా వెలుగుచూసింది. బాధితుడైన ఆంధ్రా రంజీ క్రికెటర్‌ బుడుమూరు నాగరాజు శుక్రవారం గుంటూరు రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన అప్పలస్వామి కుమారుడు నాగరాజు ఆంధ్రా రంజీ జట్టు తరఫున గత ఐదేళ్లుగా క్రికెట్‌ ఆడుతున్నాడు. రెండేళ్ల కిందట విజయవాడకు చెందిన భరత్‌చంద్ర ద్వారా నాగరాజుకు కోడెల శివరామ్‌ పరిచయమయ్యాడు. ఆ సమయంలో తనకు రైల్వే ఉద్యోగంపై మక్కువ ఉందని కోడెల శివరామ్‌కు చెప్పాడు. 

దీన్ని ఆసరాగా చేసుకున్న శివరామ్‌ స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ఏఎల్‌పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో గతేడాది ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్‌ వెళ్లాలని శివరామ్‌ చెప్పాడు. అతడు చెప్పినట్టే నాగరాజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని మరుసటి రోజు కాన్పూర్‌ వెళ్లాడు. అక్కడ కోడెల శివరామ్‌కు చెందిన ఓ వ్యక్తి నాగరాజును కలిసి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాల భర్తీ చేసేటప్పుడు కబురు చేస్తామని నమ్మబలికాడు. దీంతో నాగరాజు తిరిగొచ్చేశాడు. 

మే 23 తర్వాత అసలు విషయం తెలుసుకుని.. 
మే 23న ఎన్నికల ఫలితాల అనంతరం కోడెల కుటుంబం అక్రమంగా వసూళ్లు చేసిన కేట్యాక్స్, ఉద్యోగాలిస్తామని మోసగించిన సంఘటనలపై వరుసగా నమోదవుతున్న కేసుల విషయం తెలుసుకుని తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్‌లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో ఈ నెల 2న నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. అయితే.. నాగరాజును బెదిరించి కోడెల అనుచరులు బాండ్‌ పేపరును చించేశారు. దీంతో తాను పోలీసులను ఆశ్రయిస్తానని నాగరాజు హెచ్చరించాడు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు తెలుస్తుందని, శుక్రవారం డబ్బు ఇస్తానని నరసరావుపేట రావాలని కోడెల పిలిపించాడు. అక్కడ నాగరాజు చాలాసేపు వేచి చూశాక గుంటూరులోని లక్ష్మీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి దగ్గరకు వెళితే డబ్బులు ఇస్తారని అక్కడకు పంపారు. గుంటూరుకు వచ్చి కోడెలకు పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో జిల్లా పోలీస్‌ కార్యాలయంలో రూరల్‌ ఎస్పీకి నాగరాజు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరాడు.  

చదవండి:
కోడెలపై లారీ ఓనర్ల ఫైర్‌..!

‘కోడెల ట్యాక్స్‌ పుట్ట బద్దలవుతోంది’

‘కే’ ట్యాక్స్‌ బాధితుల క్యూ

అజ్ఞాతంలో కోడెల కుమారుడు, కుమార్తె

‘కే ట్యాక్స్‌’పై ఐదు కేసులు

కోడెల తనయుడు శివరామ్‌పై కేసు నమోదు

కోడెల పోలీస్‌ పర్మిషన్‌ కూడా తీసుకోలేకపోయాడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top