
కర్నూలులో పర్యటించిన మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు
ప్రభుత్వ పథకాలు అందడం లేదంటూ నిలదీసిన ప్రజలు
కర్నూలు(హాస్పిటల్): ‘ఇంటింటికీ సుపరిపాలన’ పేరుతో కర్నూలు ప్రజల వద్దకు వెళ్లిన మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజుకు ఇంటింటా చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ పథకాలు అందడం లేదంటూ ప్రజలు నిలదీశారు. పింఛన్ ఇవ్వట్లేదని, గ్యాస్ సబ్సిడీ అందడం లేదని, తల్లికి వందనం డబ్బులు పడలేదంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు బుధవారం ఉదయం నగరంలోని బుధవారపేటలో పర్యటించారు. ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. వారు తిరిగిన ఇళ్లల్లో అత్యధిక శాతం మంది తమకు సంక్షేమ పథకాలేవీ అందడం లేదని జవాబులివ్వడంతో.. టీడీపీ నేతలు కంగుతిన్నారు.
పింఛన్ ఎందుకివ్వట్లేదు?
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని ఏడాదైనా ఇప్పటికీ మంజూరు చేయలేదని సుంకులమ్మ అనే వృద్ధురాలు ప్రశ్నించింది. తనకు పదేళ్ల క్రితం ప్రమాదంలో కాళ్లు పోయాయని.. అయినా వికలాంగుల పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదని సందెపోగు రఘు అనే వృద్ధుడు నిలదీశాడు. కనీసం వృద్ధాప్య పింఛన్ కూడా ఇవ్వట్లేదని మండిపడ్డాడు. పదో తరగతి చదువుతున్న తనకు తల్లికి వందనం డబ్బులు పడలేదని మేరి కుమారి అనే విద్యార్థిని వాపోయింది.
తమకు ఉచిత గ్యాస్ పథకం ఎందుకు వర్తింపజేయలేదంటూ విజయ్‌కుమార్ అనే వ్యక్తి టీడీపీ నేతలను నిలదీశారు. తాను బీటెక్ పూర్తి చేశానని.. ఉద్యోగం ఇప్పించాలని మంత్రిని దీపిక అనే యువతి కోరారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాగానే ఉద్యోగం ఇప్పిస్తానంటూ మంత్రి భరత్ జవాబివ్వడంతో ఆమె షాక్‌కు గురైంది. మంత్రి మీడియాతో మాట్లాడుతూ..ఎవరో ఒకరిద్దరు పథకాలు అందలేదని చెబితే ‘సాక్షి’లో అవే చూపిస్తారంటూ అక్కసు వెళ్లగక్కారు.
వితంతు పింఛన్లు ఎప్పుడిస్తారు?
జి.సిగడాం: ‘ఎంపీ బాబూ.. మా ఇంటి పెద్ద దిక్కు మరణించి ఏడాది కాలమైనా ఇంత వరకు వితంతువుల పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదు. మేమంతా అనాథలుగా ఉన్నాం. వీటితోపాటు తల్లికి వందనం కింద రూ.15 వేలు అన్నారు. రూ.13 వేలు మాత్రమే మా ఖాతాలో జమ చేశారు. ఇదేనా సుపరిపాలన?’ అంటూ వితంతువులు విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం, ఆనందపురం గ్రామాల్లో నిలదీశారు.