నిర్లక్ష్యం ఖరీదు..నిండు ప్రాణం

kid dead in road accident - Sakshi

 సాక్షి , ఖమ్మం క్రైం : ఒకడి అంతులేని నిర్లక్ష్యం.. బాలుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆ తల్లిదండ్రులకు ఆజన్మ గర్భ శోకాన్ని మిగిల్చింది.

తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు అర్వపల్లి రాము, రమ. బతుకుదెరువు కోసం ఖమ్మం వచ్చారు. నగరంలోని మామిళ్లగూడెంలోగల ఎస్‌ఎన్‌ మూర్తి తోట ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు వర్షిత్‌(7), హర్షిత్‌(5). దగ్గరలోగల పాఠశాలలో వర్షిత్‌ రెండోతరగతి చదువుతున్నాడు. శ్రీనివాస థియేటర్‌ సమీపంలోగల ఎలక్ట్రికల్‌ షాపులో గుమస్తాగా రాము పనిచేస్తున్నాడు. తాము నివాసముంటున్న ప్రాంతంలోనే ఇటీవల చిన్న కిరాణం దుకాణం పెట్టుకున్నారు.
బుధవారం రోజున పిల్లలిద్దరూ ఇంట్లో ఆడుకుంటున్నారు. పండుగ కోసం పిండి వంటలు చేద్దామనుకుంది ఆ తల్లి. పిండి పట్టించేందుకు బియ్యపు సంచీని వర్షిత్‌కు ఇచ్చి, తండ్రి నడుపుతున్న కిరాణా దుకాణానికి పంపింది. ఆ చిన్నారి వడివడిగా నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు.
అక్కడున్న ఖాళీ స్థలంలో ఓ ట్రాక్టర్‌ ఎప్పుడూ ఖాళీగా ఉండేది. సరిగ్గా అదే సమయంలో దానిని యజమాని కొప్పుల రామకృష్ణారెడ్డి నడుపుకుంటూ రోడ్డు మీదకు వేగంగా తీసుకొచ్చాడు. ఆ రోడ్డు అసలే చాలా చిన్నది. వేగంగా వచ్చిన ఆ ట్రాక్టర్‌.. రోడ్డుపై నడుస్తున్న చిన్నారి వర్షిత్‌ను ఢీకొనొ కొంత దూరం లాక్కెళ్లింది. ఆ తరువాత అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది.
ఆ చిన్నారి.. అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. తల, ముఖం ఛిద్రమైంది. చేతిలోని బియ్యపు సంచి ఎగిరిపడింది.
తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. స్థానికులు కంట తడి పెట్టారు.
ట్రాక్టర్‌ను నడిపిన యజమాని పారిపోయాడు. అతని కోసం స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలతో గాలించారు. అక్కడకు దగ్గరలోగల అతడి నుంచి ఏ ఒక్కరూ కూడా బయటకు రాకపోవడంపై స్థానికులు మండిపడ్డారు.
ప్రమాద స్థలాన్ని ఖమ్మం అర్బన్‌ సీఐ నాగేంద్రచారి పరిశీలించారు. టూటౌన్‌ ఎస్‌ఐ కృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top