ఖమ్మంలో కార్పొరేటర్‌ వీరంగం

Khammam Corporator attacked On Sweet Shop Owner - Sakshi

కుమారుడితో కలిసి స్వీట్‌షాప్‌పై దాడి

అప్పు చెల్లించమని అడిగినందుకు వారితో కొట్లాట

ఒకరి కిడ్నాప్‌నకు యత్నం

కేసు నమోదు చేసిన పోలీసులు

సాక్షి, ఖమ్మం : నగరంలో అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్‌ ఆవేశంతో ఊగిపోయాడు. అతడి కుమారుడితో కలిసి సోమవారం రాత్రి ఓ స్వీట్‌ షాపుపై దాడి చేశాడు. స్వీట్‌ షాపు యజమాని కొడుకును దారుణంగా కొట్టి కిడ్నాప్‌నకు యత్నించిన సంఘటన కలకలం రేకెత్తించింది. ఈ సంఘటనలో షాపు యజమాని, అతని కుమారుడికి గాయాలయ్యాయి. త్రీటౌన్‌ సీఐ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం..
వ్యవసాయమార్కెట్‌ రోడ్‌లో గల కృష్ణ స్వీట్‌ షాప్‌ యజమాని కృష్ణకు అతని సమీప బంధువు అయిన 47వ డివిజన్‌ కార్పొరేటర్‌ మాటేటి నాగేశ్వరరావు అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాల్సి ఉంది. కొంతకాలం నుంచి ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ మేరకు సోమవారం రాత్రి కార్పొరేటర్‌ నాగేశ్వరరావు, ఆయన కుమారుడు రాకేష్‌లు కొంతమందితో కలిసి వచ్చి స్వీట్‌ షాపుపై దాడికి పాల్పడ్డారు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన షాపు యజమాని కుమారుడైన ఆకుల విజయ్‌ను కొట్టి తీవ్రంగా గాయపర్చారు. ఈ సంఘటనలో షాపు యజమాని కృష్ణకు సైతం గాయాలయ్యాయి. దుకాణంలో ఉన్న అద్దాలు పగులకొట్టి, సామగ్రిని చిందరవందరగా పడవేయడంతో..అప్పటికే అక్కడ ఉన్న వినియోగదారులు సైతం భయాందోళనతో పరిగెత్తారు.


స్వీట్‌షాప్‌లో చిందరవందరగా తినుబండారాలు 

 తర్వాత విజయ్‌ను బలవంతంగా కిడ్నాప్‌ చేసి కారులోకి ఎక్కించుకుని..కొట్టుకుంటూ కొంతదూరం తీసుకెళ్లి..ఆ తర్వాత విడిచిపెట్టారు. అనంతరం బాధితులు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన గొడవకు సంబంధించి ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీధర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి..షాపులో ఉన్న సీసీ పుటేజ్‌ల ద్వారా ఆధారాలు సేకరించారు. అనంతరం కార్పొరేటర్‌ మాటేటి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు రాకేష్, వారి గుమస్తాలు అయిన సాయి, రాము, సురేష్‌ మరికొందరిపై నాన్‌ బెయిల్‌బుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top