మహిళ అధికారిని హతమార్చి.. ఆపై వేషం మార్చి | Sakshi
Sakshi News home page

మహిళ అధికారిని హతమార్చి.. ఆపై వేషం మార్చి

Published Fri, May 4 2018 12:27 PM

Kasauli Hotel Owner Arrested For Shot Woman Officer - Sakshi

సిమ్లా : విధులు నిర్వహిస్తున్న మహిళ అధికారిని హతమార్చి వేషం మార్చుకుని తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్రమ కట్టడాలు కూల్చివేయాల్సిందిగా ఏప్రిల్‌ 17న హిమచల్‌ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కసౌలీ, ధరమ్‌పూర్‌ పట్టణాల్లోని అక్రమ కట్టడాల కూల్చివేతకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అసిస్టెంట్‌ టౌన్‌ ప్లానర్‌గా విధులు నిర్వహిస్తున్న షేల్‌ బాలా అందులోని ఓ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. 

తన విధుల్లో భాగంగా మంగళవారం కసౌలీ పట్టణంలోని విజయ్‌ సింగ్‌ అనే వ్యక్తికి చెందిన హోటల్‌ భవనాన్ని కూల్చేందుకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. నాలుగు అంతస్తులకే అనుమతి తీసుకున్న విజయ్‌ ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించడంతో ఆమె ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ దీనిని వ్యతిరేకిస్తూ.. విజయ్‌సింగ్‌, అతని తల్లి మహిళ అధికారిణితో వాగ్విదానికి దిగారు. అయిన ఆమె వెనక్కి తగ్గకపోవడంతో విజయ్‌  అక్కడవున్న అధికారులపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు.

దీంతో షేల్‌ బాలా అక్కడిక్కడే మృతి చెందారు. అనంతరం విజయ్‌ ​సమీపంలోని అటవీ ప్రాంతలోకి పారిపోయాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసు శాఖ అధికారులు అతని ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డు అందజేస్తామని ప్రకటించారు. అడవిలోకి పారిపోయిన అనంతరం విజయ్‌ తన స్నేహితులకు ఫోన్‌ చేసి సహాయం చేయాల్సిందిగా కోరారు. పోలీసులు ఫోన్‌ను ట్రేస్‌ చేస్తారనే అనుమానంతో వెంటనే మొబైల్‌ స్విచ్ఛాప్‌ చేశాడు. ఇలా అయితే దొరికిపోతామనే ఆలోచనతో గడ్డం తీయించడంతో పాటు, హెర్‌ స్టైల్‌ మార్చి, వివిధ ప్రాంతాల్లో సంచరించడం మొదలు పెట్టాడు.

మళ్లీ తన స్నేహితులకు విజయ్‌ కాల్‌ చేయడంతో, పోలీసులు అతని లోకేషన్‌ ట్రేస్‌ చేశారు. అతడు మథురాలో ఉన్నట్టు తెలీడంతో, ఢిల్లీ పోలీసులను సహాయంతో గురువారం అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.

Advertisement
Advertisement