కరడుగట్టిన దొంగ అరెస్టు  

Kamareddy Police Nab The Serial House Burglar - Sakshi

జైలు నుంచి రాగానే మళ్లీ చోరీలు

పట్టుబడిన వ్యక్తి 30 కేసుల్లో నిందితుడు

వివరాలు వెల్లడించిన డీఎస్పీ లక్ష్మీనారాయణ  

సాక్షి, కామారెడ్డి: దొంగతనాలకు పాల్పడి గతంలో పలుమార్లు జైలుకు వెళ్లాడు. శిక్ష అతడిలో ఎలాంటి పరివర్తన తీసుకురాలేకపోయింది. చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలుపాలవ్వడం.. విడుదల కాగానే మళ్లీ చోరీలకు పాల్పడడం.. అలవాటుగా మారిపోయింది. ఇలా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని కామారెడ్డి పోలీసులు మళ్లీ పట్టుకుని కటకటాల వెనక్కిపంపారు. 

జల్సాల కోసం చోరీలను ఎంచుకున్నాడు. ఇప్పటికే చాలాసార్లు పట్టుబడి జైలుకు వెళ్లివచ్చాడు. అయినా అతడి బుద్ధి మారలేదు. జైలు నుంచి విడుదలైన రోజే చోరీలు మళ్లీ ప్రారంభించాడు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తాళం వేసిన ఇండ్లను టార్గెట్‌ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ కరుడుగట్టిన నిందితుడిని బుధవారం కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ లక్ష్మీనారాయణ విలేకరులకు వివరాలు వెల్లడించారు.

ట్టణంలోని పిట్ల గల్లీలోని శివాజీ రోడ్‌ లో ఉన్న తోకల నర్సింలు కుటుంబం గత నెల 21న ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని వెళ్లారు. అదే రోజు రాత్రి తాళం పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోని రెండు తులాల బంగారం, పదితులాల వెండి, రూ.2 లక్షల 9 వేల నగదును చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించగా చోరీ చేసిన వ్యక్తిని గుర్తించారు. ఇందిరానగర్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ షాహిద్‌గా గుర్తించి అతడి కోసం గాలించారు. రెండు బృందాలుగా పోలీసులు పాత నేరస్తుడైన షాహిద్‌ కోసం గాలిస్తున్నారు. బుధవారం సిరిసిల్లా రోడ్‌లోని క్లాసిక్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రెండు తులాల బంగారం, పది తులాల వెండి, రూ.35,550 నగదును, అతడు చోరీ చేసిన ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.  

జల్సాల కోసమే చోరీలు...  
పిట్లగల్లీలో జరిగిన చోరీ కేసులో పోలీసులు గుర్తించిన మహ్మద్‌ షాహిద్‌ పాత నేరస్తుడు. అతడిపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే 30 కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు కరడుగట్టిన నేరస్తుడని చెప్పారు. ఇప్పటికే చాలాసార్లు జైలుకు వెళ్లివచ్చిన అతనిలో మార్పు రాలేదన్నారు. జైలు నుంచి వచ్చిన ప్రతీసారి చోరీలు చేయడమే పనిగా మారినట్లు తెలిపారు. గతనెల 18నే జైలు నుంచి విడుదలైన అతను అదే రోజున అయ్యప్పనగర్‌లో ఓ బైక్‌ను చోరీ చేసినట్లు తెలిపారు. ఆ మరుసటి రోజునే పిట్లగల్లీలో చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడు కేవలం జల్సాల కోసమే చోరీలను ఎంచుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వచ్చిన డబ్బులతో ఢిల్లీ, అజ్మీర్, రాజస్థాన్, షిరిడీ, తిరుపతి ప్రాంతాల్లో తిరిగి దైవ దర్శనాలు, జల్సాలు చేసి వచ్చాడన్నారు.  

సిబ్బందికి అభినందనలు.. 
నిందితుడిని గుర్తించాక అతడిని పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి కృషి చేసిన పట్టణ ఎస్‌ఐలు రవికుమార్, గోవింద్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కేసు చేదనలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర వహించాయన్నారు. సీసీ కెమెరాల కారణంగానే చోరీకి పాల్పడింది పాత నేరస్తుడేనని 24 గంటల్లోగా గుర్తించగలిగామన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. ఎస్‌హెచ్‌ఓ రామక్రిష్ణ, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top