తాడిపత్రి : ప్రతీకార దిశగా జేసీ గ్యాంగ్‌

Jc Brothers Gang Attack On Ycp Activists In Tadipatri - Sakshi

సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : వైఎస్సార్సీపీలో క్రీయాశీలకంగా పనిచేయడమే కాకుండా ఎన్నికల్లో తమ ఓటమికి కారణమయ్యారనే అక్కసుతో టీడీపీ నేతలు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఓటమికి కారకులైన వారిని ఓ పథకం ప్రకారం తుదముట్టించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. కనీసం కుటుంబంలో ఎవరినో ఒకరినైనా అంతమొందించాలనే జేసీ వర్గీయుల పన్నాగం తెలుసుకున్న ఓ బ్యాంకు ఉద్యోగి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని పోలీసులను ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఆరా తీశారు.

వివరాల్లోకి వెళితే.. వీరాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వంశీమోహన్‌రెడ్డి సోదరుడు అనీల్‌కుమార్‌రెడ్డి అనంతపురంలోని రామ్‌నగర్‌ ఏడీసీ బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం అనిల్‌కుమార్‌ తన వాహనంలో వైఎస్సార్‌ జిల్లాలోని ఆర్‌ఎస్‌.కొండాపురానికి పని నిమిత్తం వెళ్లి తిరిగి తాడిపత్రికి బయలుదేరాడు. అయితే అనిల్‌ ప్రయాణిస్తున్న మారుతి ఎర్టీగా వాహనాన్ని వెనుకవైపు నుంచి బొలెరో వాహనం వెంబడిస్తూ వచ్చింది. టిఫిన్‌ చేసేందుకని అనిల్‌ తాళ్ళప్రొద్దుటూరు సమీపంలోని సుగుమంచిపల్లి సమీపంలోని బైపాస్‌లో కృష్ణా హోటల్‌ వద్ద తన వాహనాన్ని ఆపి వెళ్లాడు. అయితే అప్పటికే తాడిపత్రి మండలంలోని టెక్‌ కళాశాల సమీపంలో పథకం ప్రకారం వీరాపురం గ్రామానికి చెందిన జేసీ వర్గీయులు శివశంకర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, రామాంజులరెడ్డి మరికొందరు బొలెరో వాహనంలో మాటేశారు. అనిల్‌ ప్రయాణిస్తున్న వాహనం అక్కడికి చేరుకోగానే ఢీకొట్టేందుకు యత్నించగా చాకచక్యంగా తప్పించుకుని తాడిపత్రి రూరల్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

గతంలో వంశీమోహన్‌రెడ్డిపై దాడికి యత్నం 
బ్యాంకు మేనేజర్‌ అనిల్‌కుమార్‌రెడ్డి సోదరుడు వంశీమోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల పోలింగ్‌ సందర్భంగా జేసీ వర్గీయులు వంశీమోహన్‌రెడ్డిపై దాడి చేసేందుకు యత్నించారు. అయితే అప్పట్లో ఇరువార్గాల పరస్పరదాడుల్లో  జేసీ వర్గీయుడు మృతి చెందాడు. ఘటన జరిగిన రోజే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అతని కుమారుడు అస్మిత్‌రెడ్డిపై వంశీమోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పట్లో పోలీసుల నుంచి స్పందన లేకపోయింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top